టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ దర్యాప్తు.. రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సిట్.. పూర్తి వివరాలు ఇవే..

By Sumanth Kanukula  |  First Published Mar 20, 2023, 1:45 PM IST

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని సిట్ బృందం విచారణ జరుపుతుంది.


టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని సిట్ బృందం విచారణ జరుపుతుంది. ఓ వైపు ఈ కేసులో నిందితులు, అనుమానితులను విచారిస్తున్న సిట్ అధికారులు.. మరోవైపు రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. పేపర్ లీకేజ్‌కు సంబంధిచి ఆయన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించాలని సిట్ అధికారులు కోరారు. 

ఒకే మండలంలో 100 మందికి ర్యాంకులు వచ్చాయని రేవంత్ చెప్పడానికి సంబంధించిన వివరాలను అందజేయాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఇక, పేపర్ లీకేజ్‌కు సంబంధించి ఆరోపణలు చేసిన మరికొందరు నాయకులకు కూడా నోటీసులు ఇచ్చే ఆలోచనలో సిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. 

Latest Videos

ఇక, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. మంత్రి కేటఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పేపర్ లీక్‌కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. రేవంత్‌ రెడ్డి కూడా కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో రోజంతా ధర్నాకు దిగారు. పేపర్ లీక్ కేసులో ఏ2 (టీఎస్‌పీఎస్సీలో కాంట్రాక్ట్ ఉద్యోగి రాజశేఖర్)తో కేటీఆర్ పీఏకు సంబంధాలున్నాయని ఆరోపించారు. ప్రశ్నపత్రం లీక్‌లో మంత్రి కేటీఆర్ పీఏ పాత్ర ఉందని అన్నారు. అతడు కేటీఆర్‌కు షాడో మినిస్టర్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఈ కేసులో రెండో నిందితుడు, కేటీఆర్ పీఏ తిరుపతిది పక్కపక్క గ్రామాలు అని.. రాజశేఖర్‌కు టీఎస్‌పీస్సీలో ఉద్యోగం ఇప్పించిందే తిరుపతి అని  ఆరోపించారు. 
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీక్‌లో కేటీఆర్ పీఏ తిరుపతి కీలక పాత్ర పోషించారని.. అతడి స్వస్థలమైన మల్యాల మండలానికి చెందిన 100 మందికి పైగా విద్యార్థులు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో 100 మార్కులకు పైగా సాధించారని ఆరోపించారు.

click me!