టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో డీఈ రమేష్ ను కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిట్.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో అరెస్టైన డీఈ రమేష్ ను కస్టడీకి ఇవ్వాలని సిట్ శుక్రవారంనాడు పిటిషన్ దాఖలు చేసింది. ఆరు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ కోర్టును కోరింది. రెండు రోజుల క్రితం డీఈ రమేష్ ను సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
డీఈ రమేష్ కు ఎవరెవరు సహకరించారనే విషయమై సిట్ దర్యాప్తు చేస్తుంది. రెండు పరీక్ష పేపర్ల మాల్ ప్రాక్టీస్ ద్వారా రూ. 10 కోట్లు వసూలు చేయాలని రమేష్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే పేపర్ లీక్ అంశం బయటకు పొక్కింది. పోలీసులు విచారణ ప్రారంభించడంతో డీఈ ఆశించిన స్థాయిలో డబ్బులు అందలేదని సిట్ గుర్తించిందని సమాచారం.
హైద్రాబాద్ లోని కోచింగ్ సెంటర్ల లో పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్ధులను రమేష్ ట్రాప్ చేసినట్టుగా సిట్ గుర్తించింది. టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల్లో అర్హత సాధిస్తారని అభ్యర్ధులను రమేష్ నమ్మించాడు. వారి నుండి కొంత మొత్తాన్ని అడ్వాన్స్ గా తీసుకున్నాడని సిట్ తమ దర్యాప్తులో గుర్తించింది. ఒక్కో అభ్యర్ధి నుండి ఒక్కో రకంగా డబ్బులు వసూలు చేశారని సమాచారం.
హైటెక్ డివైజ్ ల ద్వారా సమాధానాలను రమేష్ అభ్యర్ధులకు చేర్చినట్టుగా సిట్ గుర్తించింది. మైక్రో లెవల్ లో ఉండే ఎలక్ట్రానిక్ డివైజ్ లను రమేష్ అభ్యర్ధులకు ఇచ్చాడన్నారు. చెవుల్లు, దుస్తుల్లో ఈ డివైజ్ లను అమర్చాడని సిట్ గుర్తించింది. ఢిల్లీలో ఈ డివైజ్ లను తీసుకువచ్చి అభ్యర్ధులకు అందించారని సిట్ టీమ్ దర్యాప్తులో తేల్చింది..
ఇదిలా ఉంటే ఏఈఈ, డీఏఓ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులకు సమాధానాలను హైటెక్ పద్దతిలో రమేష్ అందించారు. లంగర్ హౌస్ పరీక్షకేంద్రంలో పనిచేసిన ఓ ఇన్విజిలేటర్ నుండి ప్రశ్రాపత్రం బయటకు తెప్పించుకొని సమాధానాలను అభ్యర్ధులకు రమేష్ పంపించారని సిట్ గుర్తించింది. ఈ విషయాలను రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. ఇప్పటికే ఓ ఇన్విజిలేటర్ ను సిట్ బృందం విచారిస్తుంది. రమేష్ కు మరో ఆరుగరు సహకరిచారని సిట్ అనుమానిస్తుంది. వీరందరిని విచారించాలని సిట్ భావిస్తుంది. ఇందుకు రమేష్ ను కస్టడీ కోరుతూ సిట్ ఇవాళ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.