కవిత నిజామాబాద్ నుండి షిప్ట్... కేసీఆర్ వ్యూహమదే..: అరవింద్ సంచలనం

By Arun Kumar PFirst Published Jun 2, 2023, 1:26 PM IST
Highlights

గత ఎన్నికల్లో తన చేతిలో ఓటమిపాలైన సీఎం కూతురు, ఎమ్మెల్సీ కవిత ఈసారి నిజామాబాద్ నుండి పోటీ చేయబోదంటూ బిజెపి ఎంపీ అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

న్యూడిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భవిష్యత్ రాజకీయాలపై బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తన కూతురుని రానున్న ఎన్నికల్లో నిజామాబాద్ నుండి కాకుండా మెదక్ నుండి పోటీ చేయించాలని కేసీఆర్ చూస్తున్నారని అరవింద్ తెలిపారు. గతంలో మాదిరిగానే నిజామాబాద్ లో బిఆర్ఎస్ గెలుపు సాధ్యంకాదని తెలిసే కేసీఆర్ నిర్ణయానికి వచ్చారన్నారు. మరోసారి తనబిడ్డ ఓడిపోరాదని జాగ్రత్తపడుతున్న కేసీఆర్ నిజామాబాద్ నుండి మెదక్ కు షిప్ట్ చేస్తున్నాడని అరవింద్ అన్నారు. 

అయితే కవిత తన తండ్రి కేసీఆర్ మాట వినకుండా మరోసారి నిజామాబాద్ లోనే పోటీచేయాలని అరవింద్ కోరారు. మెదక్ కు పారిపోకుండా నిజామాబాద్ లోనే పోటీచేసి గెలిచి చూపించాలని బిజెపి ఎంపీ సవాల్ విసిరారు. కవిత రాజకీయాలు నిజామాబాద్ లో సాగవని... ఆమెను మరోసారి ఓడించాలన్న కసితో ఇక్కడి ప్రజలు వున్నారన్నారు. ఇది గుర్తించిన కేసీఆర్ కూతుర్ని మరోచోట పోటీ చేయించాలని చూస్తున్నాడని అన్నారు. 

తెలంగాణకు చెందిన పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి బిజెపిలో చేరారు. ఎంపీ అరవింద్ ను వెంటబెట్టుకుని న్యూడిల్లీకి వెళ్లిన రాకేష్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో బిజెపిలో చేరారు. రాకేష్ రెడ్డికి బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తరుణ్ చుగ్. 

Read More  ఢిల్లీ లిక్కర్ స్కాం : శరత్ చంద్రారెడ్డితో.. కవిత, కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధం..!!..

ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ... బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన చాలామంది నాయకులు బిజెపిలో చేరేందుకు సిద్దంగా వున్నారన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపబోవని... పక్కింట్లో బిర్యానీ వండితే మన కడుపు నిండదని అన్నారు. ఇక బిఆర్ఎస్ ఓ రోగమైన దానికి సరైన వ్యాక్సిన్ బిజెపి అని అరవింద్ వ్యాఖ్యానించారు.

ఇక తరుణ్ చుగ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కు అనుకూల రాజకీయాలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తెలంగాణలో బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో వున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇందుకోసమే కేసీఆర్ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని అన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తులపై లోపాయికారి ఒప్పందం జరిగిపోయిందని తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. 

click me!