గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. మరో 10 రోజుల్లో ప్రిలిమ్స్ ఫలితాలు, మరి మెయిన్స్ ఎప్పుడంటే..?

By Sumanth KanukulaFirst Published Dec 18, 2022, 11:09 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను మరో 10 రోజుల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను మరో 10 రోజుల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సమాంతర రిజర్వేషన్ల విధానంలోనే పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు సూచించడంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు మార్గం సుగమం అయింది. దీంతో టీఎస్‌పీఎస్సీ అధికారులు శుక్రవారం గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల, మెయిన్స్‌ పరీక్ష నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. 10 రోజుల్లో ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసి.. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మెయిన్స్ పరీక్షలను కమిషన్ నిర్వహించాలని  టీఎస్‌పీఎస్సీ ఆలోచిస్తుంది. పదిరోజుల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్‌ ఫలితాలను విడుదల చేయనున్నట్టు కమిషన్‌ చైర్మన్‌ బీ జనార్దన్‌రెడ్డి తెలిపారు.

ఏప్రిల్‌లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నప్పటికీ.. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, పదో తరగతి పబ్లిక్ పరీక్షలు, నీట్, ఇతర పోటీ పరీక్షలషెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తేదీలను ఖరారు చేయనుంది. 

గ్రూప్-1 కింద 503 ఖాళీలను భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు భారీగా దరఖాస్తులు కూడా వచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్‌ 16న నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 2,86,051 మంది హాజరయ్యారు. అందులో బబ్లింగ్‌, ఇతర నిబంధనలు పాటించని 135 మందిని పక్కనపెట్టి.. మిగిలిన 2,85,916 మంది అభ్యర్థుల ఓఎంఆర్‌ పత్రాల ఇమేజింగ్‌ను టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే పూర్తిచేసింది. తుది కీని  కూడా ఇప్పటికే ప్రకటించింది. 

మెయిన్స్‌కు అర్హత సాధించేందుకు గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో కనీస అర్హత మార్కులు ఉండవని గతంలోనే టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మల్టీ జోన్ వారిగా రిజర్వేషన్ రూల్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మందిని ఎంపిక చేయనున్నట్టుగా తెలిపింది. ఈ లెక్కన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల తర్వాత.. మొత్తం 25,150 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. మొత్తం 503 పోస్టులు ఉండగా.. ఒక్కో ఉద్యోగానికి 50 మంది చొప్పున షార్ట్ లిస్ట్ జరగనుంది. గ్రూప్-1 మెయిన్స్ పూర్తయిన తర్వాత, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. గ్రూప్ 1 కోసం ఇంటర్వ్యూ రౌండ్ లేనందున.. అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలలో వారి స్కోర్‌ల ఆధారంగా ఎంపిక చేయబడతారు.

click me!