మంచిర్యాలలో ఆరుగురి సజీవదహనం: ప్రియుడితో కలిసి భార్య చేసిన పని..!

By Sumanth Kanukula  |  First Published Dec 18, 2022, 10:01 AM IST

మంచిర్యాల జిల్లా వెంకటాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.


మంచిర్యాల జిల్లా వెంకటాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురితో పాటు ఓ సింగరేణి ఉద్యోగి కూడా ఉన్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటం.. వారి కుటుంబ సభ్యులు, బంధువులనే కాకుండా స్థానికంగా ఉన్నవారిని కూడా తీవ్రంగా కలిచివేసింది. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంట్లోని మహిళతో సింగరేణి కార్మికుడికి ఉన్న వివాహేతర సంబంధం కారణంగా అతడి భార్య పథకం ప్రకారం ఈ దారుణానికి పాల్పడినట్టుగా ప్రాథమికంగా తేలింది. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. వెంకటాపూర్‌కు చెందిన మాసు శివయ్య, పద్మ అలియాస్ రాజ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నాడు. శివయ్య వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. పిల్లలందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ప్రస్తుతం వెంకటాపూర్‌లోనే శివయ్య, పద్మ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే పద్మకు సింగరేణిలో మజ్దూరుగా పనిచేస్తున్న లక్షేటిపేట మండలానికి చెందిన శనిగారపు శాంతయ్య‌తో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. 

Latest Videos

శాంతయ్యకు భార్య సృజన, ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. ఇద్దరు కొడుకు ప్రస్తుతం నిరుద్యోగులుగా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నివాసం ఉంటున్నారు. పద్మతో శాంతయ్య వివాహేతర సంబంధం కొనసాగించడం కుటుంబంలో విబేధాలకు కారణమైంది. ఈ విషయంలో పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ విషయం పోలీసుల వద్దకు కూడా చేరింది. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసిన ఎటువంటి లాభం లేకుండా పోయింది.

మరోవైపు సృజన కొంతకాలంగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే శాంతయ్య కుటుంబంలో ఆస్తుల విషయంలో గొడవలు జరగుతూనే ఉన్నాయి. శాంతయ్య మెడికల్ అన్‌ఫిట్ అయితే కొడుకుల్లో ఒకరికి ఉద్యోగం వస్తుందని కుటుంబ సభ్యులు అతడిపై ఒత్తిడి తెస్తున్నారు. మరో జీతం డబ్బులను కూడా పద్మకే ఇస్తున్నారనే అతడిపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలోనే గతంలో కూడా శాంతయ్యను చంపేందుకు ప్రయత్నాలు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సృజన సూచన మేరకు ఆమె ప్రియుడు శాంతయ్య సహజీవనం చేస్తున్న పద్మ కుటుంబాన్ని అంతమొందించేందుకు ఈ దారుణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. 

పెద్దమ్మను చూసేందుకు వచ్చి.. 
కోటపల్లి మండలం కొండంపేట గ్రామానికి చెందిన నెమలికొండ మౌనిక పద్మకు కూతురు వరుస అవుతుంది. ఐదు రోజుల క్రితం తన ఇద్దరు పిల్లలు హిమబిందు,  ప్రశాంతిలతో కలిసి వెంకటాపూర్‌లో పద్మ ఇంటికి వచ్చింది. మౌనిక భర్త ఏడాది క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. మౌనిక తల్లిదండ్రులు పదేళ్ల క్రితం చనిపోయారు. అయితే చుట్టుపు చూపుగా పెద్దమ్మ ఇంటికి వచ్చిన మౌనిక తన పిల్లలతో కలిసి ప్రమాదంలో చిక్కుకుని సజీవ దహనం కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. 

అసలేం జరగింది.. 
పద్మ ఇంట్లో అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అయితే పెంకుటిల్లు కావడంతో మంటలు వేగంగా వ్యాప్తిచెందాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందకి సమాచారం అందించారు. అయితే వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అయితే అప్పటికే ఇంట్లోని వారు కాలిబుడిదయ్యారు. మృతులను శివయ్య, అతని భార్య పద్మ, పద్మ  చెల్లెలి కూతురు మౌనిక, మౌనిక పిల్లలు ప్రశాంతి, హిమబిందు, సింగరేణి ఉద్యోగి శాంతయ్యగా గుర్తించారు. ఇక, సంఘటనా స్థలాన్ని మంచిర్యాల డిప్యూటీ కమిషనర్‌ అఖిల్‌ మహాజన్‌, ఇతర ఉన్నతాధికారులు సందర్శించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అఖిల్ మహాజన్ చెప్పారు.

అయితే ఇంట్లో గ్యాస్‌లీక్ అయినట్టుగా ఎటువంటి ఆధారాలను పోలీసులు గుర్తించలేదు. అయితే ప్రమాదం జరిగిన ఇంటి వెనకాల టైర్లు సగం  కాలిన స్థితిలో ఉండటం.. వాటికి కొద్ది దూరంలోనే 10 లీటర్ల చొప్పున సామర్థ్యం ఉన్న రెండు పెట్రోల్ డబ్బాలు ఉండటంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పథకం ప్రకారమే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. శాంతయ్య కుటుంబ సభ్యులే దీని వెనక ఉన్నట్టుగా ప్రాథమిక విచారణలో తేలినట్టుగా సమాచారం. మరోవైపు కరీంనగర్‌లోని రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ అధికారులు అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. అయితే ఇప్పటికే పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తిస్థాయిలో నిర్దారణకు వచ్చాక వివరాలను వెల్లడించనున్నారు. 

click me!