టిఎస్పిఎస్సీ సభ్యులకు భారీగా పెరిగిన వేతనాలు

First Published Aug 11, 2017, 7:01 PM IST
Highlights
  • భారీగా పెరిగిన టిఎస్ పిఎస్ సి సభ్యుల వేతనాలు
  • 3రెట్లకు పైగా పెంచిన తెలంగాణ సర్కారు
  • 2016 జనవరి నుంచే వేతనాల పెంపు అమలు
  • 19 నెలల బాకాయీలు సైతం చెల్లిస్తామని ఉత్తర్వులు

తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఛైర్మన్, సభ్యుల వేతనాలు భారీ స్థాయిలో పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలక మండలి సభ్యుల వేతనాలను పెంచుతూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో టిఎస్పిఎస్సీ ఛైర్మన్ వేతనం 80 వేలు ఉంది. దాన్ని ఇప్పుడు 2.25 లక్షలకు పెంచింది తెలంగాణ సర్కారు. అలాగే గతంలో పాలకమండలి సభ్యుల వేతనాలు 79 వేలు ఉండగా ఇప్పుడు ఆ వేతనాన్ని 2.24 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది.

ఇక ఈ పెరిగిన వేతనాలు ఇప్పటి నుంచి కాకుండా 2016 జనవరి నుంచి అమలు చేయనున్నట్లు తెలంగాణ సర్కారు పేర్కొన్నది. అంటే ఇప్పటి వరకు గత ఏడాది 12 నెలలు, ఈ ఏడాది 7 నెలలు మొత్తం కలిపి 19 నెలల పెరిగిన వేతన బకాయీలను సైతం చెల్లిస్తామని సర్కారు ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం అఖిలభారత సర్వీసు అధికారుల వేతనాలతోపాటు పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యుల వేతనాలను పెంచాలన్న సూచన మేరకే తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారీగా వేతనాలు పెరగడంతో టిఎస్ పిఎస్సీ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మూడు రెట్లు వేతనాలు పెరగడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు కమిషన్ సభ్యులు.

click me!