టీఎస్ పిఎస్సి ఛైర్మన్ కు లక్ష కోట్ల అక్రమాస్తులా...! : మహేందర్ రెడ్డి సీరియస్ రియాక్షన్

By Arun Kumar P  |  First Published Feb 7, 2024, 8:57 AM IST

ప్రస్తుత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్ మహేందర్ రెెడ్డి తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై ,చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. 


హైదరాబాద్ : తెలంగాణ మాజీ డిజిపి, ప్రస్తుత టిఎస్ పిఎస్సి ఛైర్మన్ మహేందర్ రెడ్డిపై హైకోర్టు న్యాయవాది రాపోలు ఆనంద్ భాస్కర్ సంచలన ఆరోపణలు చేసారు. పోలీస్ శాఖలో వివిధ హోదాలో పనిచేసిన మహేందర్ రెడ్డి తెలంగాణ డిజిపి స్థాయికి చేరుకున్నారు... కానీ ఆయన కెరీర్ మొత్తం అవినీతిమయమేనని రాపోలు ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల ఆస్తులను ఆయన సంపాదించారని... దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. మహేందర్ రెడ్డి అక్రమాలకు సంబంధించిన 14 పేజీల నోటీసులు సిద్దం చేయడమే కాదు రాష్ట్ర గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసారు రాపోలు. 

ఇలా తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై తెలంగాణ పబ్లిక్ సర్వీక్ కమీషన్ ఛైర్మన్ మహేందర్ రెడ్డి స్పందించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసానని...  తనకు క్లీన్ రికార్డ్ వుందని తెలిపారు. పోలీస్ గా బాధ్యతలు చేపట్టింది మొదలు రిటైర్మెంట్ వరకు ఎంతో నిజాయితీతో, అంకితబావంతో పనిచేసానని అన్నారు. అందువల్లే తన 36 ఏళ్ల సర్వీస్ లో ఎలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదని మహేందర్ రెడ్డి తెలిపారు.   

Latest Videos

డిజిపిగా ఉన్నత బాధ్యతల చేపట్టినా, తన చేతిలో అధికారం వున్నా ఏనాడు దుర్వినియోగం చేయలేదని అన్నారు. ఇలా చాలా గౌరవప్రదంగా పోలీస్ శాఖ నుండి బయటకు వచ్చానని మహేందర్ రెడ్డి తెలిపారు. ఇలాంటి  తనపై ఇప్పుడు అవినీతి ఆరోపణలు రావడం ఎంతో బాధిస్తోందని... కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తన రెప్యుటేషన్ దెబ్బతీసేందుకు సోషల్ మీడియా వేదికన కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. టీఎస్ పిఎస్సీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే తనపై అవినీతి ఆరోపణలు మొదలయ్యాయని మహేందర్ రెడ్డి అన్నారు. 

Also Read  TSPSC Group 1: గ్రూప్‌ - 1పై రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

తనపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజాలు లేవని... అదంతా తప్పుడు ప్రచారమేనని అన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు. తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నవారు...వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నవారిపై పరువునష్టం దావా వేస్తానని టిఎస్ పిఎస్సి ఛైర్మన్ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. 
 

click me!