పేపర్ లీకేజ్ వ్యవహారం నేపథ్యంలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పరీక్షను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రకటించింది.
పేపర్ లీకేజ్ వ్యవహారం నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 5న ఏఈ పరీక్ష జరిగింది. ఇంజనీరింగ్ విభాగాల్లోని 837 పోస్టులకు ఈ పరీక్షను నిర్వహించారు. మార్చి 5న దాదాపు 55 వేల మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
మరోవైపు.. పేపర్ లీకేజ్ కేసుకు సంబంధించి టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడారు. ఏఈ పరీక్షపై బుధవారం నిర్ణయం తీసుకుంటామని.. ఈ పరీక్షపై ఇంకా నివేదిక రావాల్సి వుందని ఛైర్మన్ వెల్లడించారు. దురదృష్టకరమైన వాతావరణంలో ప్రెస్‌మీట్ పెడుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చాక దాదాపు 35 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు జనార్థన్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం 25 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. టీఎస్పీఎస్సీ అనేక కొత్త విధానాలు తెచ్చిందని.. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో దేశంలోనే ఎక్కడా లేని విధంగా మల్టిపుల్ జంబ్లింగ్ చేశామని ఛైర్మన్ తెలిపారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ అక్రమాలు జరగొద్దనే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నామని జనార్థన్ రెడ్డి చెప్పారు.
ఇకపోతే.. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రవీణ్‌తో పాటు పాలుపంచుకున్న రేణుక సెలవుల విషయంలోనూ ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. వనపర్తి మండలం బుద్ధారం ఎస్సీ గురుకుల పాఠశాలలో హిందీ టీచర్‌గా వ్యవహరిస్తున్నారు రేణుక. ఏడాది 12 సెలవులు పెట్టింది రేణుక. ఈ నెల 4 , 5 తేదీల్లో తమ బంధువు మృతిచెందాడని సెలవు పెట్టింది. ఆ తేదీల్లోనే పేపర్ లీక్ జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే రేణుక సర్టిఫికెట్ల విషయంలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి. టీఎస్పీఎస్సీ నిర్వహించిన ప్రతి పరీక్ష ముందు సెలవులు పెడుతోంది రేణుక.
పేపర్ లీక్‌కు సూత్రధారిగా రాజశేఖర్‌ను తేల్చారు పోలీసులు. ప్రవీణ్ ద్వారా పేపర్‌ను బయటికి తెప్పించాడు రాజశేఖర్. టీఎస్పీఎస్సీలో సిస్టం అడ్మినిస్ట్రేటర్‌గా రాజశేఖర్ వ్యవహరిస్తున్నాడు. టెక్నికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చాడు రాజశేఖర్. ప్రవీణ్, రాజశేఖర్ కలిసి పేపర్‌ను బయటకు తెచ్చినట్లుగా గుర్తించారు పోలీసులు. సిస్టం పాస్వర్డ్ ఐడీ ఇచ్చినందుకు భారీగా డబ్బులు ముట్టజెప్పాడు ప్రవీణ్.