గ్రూప్ 1 అభ్యర్థులకు అలర్ట్.. మెయిన్స్ పరీక్ష తేదీలను ఖరారు చేసిన టీఎస్‌పీఎస్సీ

By Sumanth KanukulaFirst Published Jan 31, 2023, 6:19 PM IST
Highlights

తెలంగాణ‌లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ఖరారు చేసింది. జూన్ 5 నుంచి జూన్ 12 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్టుగా తెలిపింది. 

తెలంగాణ‌లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ఖరారు చేసింది. జూన్ 5 నుంచి జూన్ 12 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్టుగా తెలిపింది. జూన్ 5న జనరల్ ఇంగ్లీష్, జూన్ 6న జనరల్ ఎస్సే, జూన్ 7న హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, జూన్ 8న ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, పాలన, జూన్ 9న ఎకానమీ, డెవలప్‌మెంట్, జూన్ 10న సైన్స్ అండ్ టెక్నాలజీ, జూన్ 12న తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ పేపర్లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించనుంది. జూన్ 11 ఆదివారం కావడంతో ఆ రోజు ఏ పరీక్ష నిర్వహించడం లేదు. 

గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ భాషల్లో జరుగుతాయని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్‌ మినహా మిగతా అన్ని పేపర్‌లకు అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో పరీక్ష రాసుకోవచ్చని పేర్కొంది.

ఇక, గ్రూప్‌-1 ద్వారా మొత్తం 503 పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను గతేడాది అక్టోబర్ 16న టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 2,85,916 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు హాజరయ్యేందుకు మొత్తం 25,050 మంది అభ్యర్థులు ఎంపికైనట్టుగా తెలిపింది. 

click me!