
ఇన్నాళ్లకు తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ ఒక్కతాటిపైకి వచ్చాయి. అదీ కేవలం ఒక్క విషయంలోనే లేండి. ఇటీవల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పై సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలతో కలిసి విసృత స్థాయి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.
అయితే ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ ఎస్సీ ఎస్టీలకు అమలు చేస్తున్న పథకాలపై ప్రతిపక్షాలు ప్రశంసలు కురిపించినట్లు వార్తలు వచ్చాయి.
దీంతో ఎస్సీ, ఎస్టీల నేతలు ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఇప్పటికీ సబ్ ప్లాన్ ను సరిగా అమలు చేయని ప్రభుత్వాన్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. దీంతో అవాక్కైన కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇప్పుడు విలేకరులను పిలిచిమరీ వివరణలు ఇస్తున్నారు.
ఆ రోజు సమావేశంలో తమ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని అభినందించారన్నది అబద్దమని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వేరువేరుగా మీడియా ముందు స్పష్టం చేశారు.
సబ్ ప్లాన్ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయక పోవడాన్ని తమ పార్టీ ఖండించిందని, ఈ విషయంలో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని భట్టి ఆరోపించారు. కేటాయించిన నిధులను ఖర్చు పెట్టాలని తాము సూచించామని చెప్పారు. మిగిలిన నిధులను కూడా తర్వాత ప్రణాళికలో ఖర్చుపెట్టేలా చూడాలని కాంగ్రెస్ సూచించిందని వివరించారు.
కాగా, సీఎం కేసీఆర్ ను పొగిడామన్నది అబద్దమని సండ్ర వెంకట వివరణ ఇచ్చారు. వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎప్పుడు తీసుకెళ్తారో సీఎం చెప్పాలని, ఎస్సీ ఫైనాన్స్ సపోర్ట్ నిధులు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీపై స్పష్టత ఇవ్వాలన్నారు.