
తెలంగాణ లో ‘కారు’కు అడ్డొస్తే కారుకూతలే వినిపించేలా ఉన్నాయి. ప్రభుత్వ పాలనపై కాస్త స్వరం పెంచి ఎవరైనా అడిగితే ప్రాంతంవాడైనా పాతరేసాలా ఉన్నాయి గులాబీ శ్రేణుల మాటలు.
తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీకి రాజకీయ జేఏసీ పూర్తి స్థాయిలో మద్దతిచ్చింది. (అసలు రాజకీయ జేఏసీ పుట్టుకకు కేసీఆరే కారణమంటారు) టీఆర్ఎస్ నేతలు రాజీనామా చేసిన ప్రతీసారి వారిని గెలిపించేందుకు టీ జేఏసీ తమవంతు కృషి చేసింది. ఆ సమయంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు టీ జేఏసీ నేత ప్రొ. కోదండరాంను టీఆర్ఎస్ ఏజెంట్ గా చిత్రీకరించారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీ కోదండరాంను కాంగ్రెస్, టీడీపీ ఏజెంట్ గా విమర్శిస్తోంది. అధికారం రాగానే కారు రూటు అలా మారిందన్నమాట.
అలా మారడానికి కారణం ఉంది. ఇటీవల ప్రభుత్వ తీరుపై కోదండరాం బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. నిన్న ఓ డైరీ ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పనితీరుపై, తెలంగాణలో ఆంధ్రా కాంట్రాక్టర్ల పెత్తనంపై, కార్పొరేట్ విద్యా దోపిడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
దీనికి ఇప్పుడు కౌంటర్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ పార్టీ తమ ఎంపీ బాల్క్ సుమన్ ను రంగంలోకి దింపింది. దీంతో ఈ జూనియర్ ఎంపీ రెచ్చిపోయారు... కొంతమంది రాజకీయ నిరుద్యోగులకు ఆయన రాజకీయ నాయకుడిగా మారారని కోదండరాంపై ఫైర్ అయ్యారు. ఉద్యోగాలను ఏ కాకి ఎత్తుకు పోలేదు..అన్నీ భర్తీ చేస్తామని, కోదండరాంను కాంగ్రెస్ కాకి ఎత్తుకు పోయిందని విమర్శించారు.
కాంగ్రెస్ దర్శకత్వంలోనే కోదండరాం విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునే కాంగ్రెస్ కుట్రలో కోదండరాం భాగస్వాములు అవుతున్నారన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను లోకమంతా మెచ్చుకుంటుంటే.. మీరు మాత్రం కాంగ్రెస్ ఏజెంట్‌గా మారిపోయి వాటిని విమర్శిస్తారా ప్రొఫెసర్ ను ప్రశ్నించారు.
తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదంరాం ఇటీవల ప్రభుత్వంపై కాస్త గట్టిగానే ఆరోపణలు చేస్తున్నమాట వాస్తవే. అయితే ఆయన తరహాలో చాలా హుందాగానే ఆ విమర్శలున్నాయి. వ్యక్తిగతంగా కాకుండా ప్రభుత్వ పనితీరుపైనే ఆయన విమర్శలు కొనసాగుతున్నాయి.
కోదండరాం ఆరోపణలు నిజంకాదని నిరూపించే అవకాశం ఉంటే ఆ పని చేయాలి కానీ, రాజకీయ నేతలను తిట్టినట్లు ఉద్యమనేతలను కూడా అదే స్థాయిలో విమర్శించడం ఆ పార్టీకి చేటు తెచ్చేలా ఉంటోంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొ. కోదండరాంను ఉద్దేశిస్తూ బంగారంలాంటి ముఖం ఆయనదని కేసీఆర్ ఓ సభలో ప్రశంసించారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అదే ముఖాన్ని ఊసరవెల్లి ముఖంలా ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు.
పార్టీ అధినేత అనుమతి లేకుండానే ప్రొఫెసర్ పై ఆ స్థాయిలో విమర్శలు చేస్తారనుకోవడం ఉత్తి భ్రమే. ఈ చిలుక పలుకులు ఎవరు పలికిస్తున్నారో ప్రజలకు తెలియంది కాదు.