ఖమ్మం కూసుమంచి వద్ద ట్రక్కులో మంటలు: డ్రైవర్ సజీవ దహనం

By narsimha lode  |  First Published Sep 3, 2023, 9:29 AM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కూసుమంచి వద్ద ట్రక్కులో మంటలు చెలరేగి  డ్రైవర్ సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.


ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కూసుమంచి వద్ద  కెమికల్ ట్రక్కు ప్రమాదానికి గురైంది. దీంతో ట్రక్కులో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో  ట్రక్కు డ్రైవర్ సజీవ దహనమయ్యారు.  ఈ ట్రక్కులో ఉన్న మరో వ్యక్తి  తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో  సూర్యాపేట వైపు వెళ్లే రహదారిపై  ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో  సర్వీస్ రోడ్డుపై నుండి  వాహనాల రాకపోకలను  అనుమతించారు పోలీసులు.  ఫైరింజన్లతో ట్రక్కులో మంటలను ఆర్పివేశారు.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన  వ్యక్తిని  ఆసుపత్రికి తరలించారు.   ఈ ప్రమాదానికి గల కారణాలపై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో  కూడ దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో డ్రైవర్లు  సజీవ దహనమైన ఘటనలు చోటు చేసుకున్నాయి.  పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్  మండలం కాట్నపల్లి రాజీవ్ రహదారిపై  రెండు లారీలు ఢీకొన్నాయి.  ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్  సజీవ దహనమయ్యాడు. క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయి.

Latest Videos

undefined

సుల్తానాబాద్  నుండి బియ్యం లోడ్ తో వెళ్తున్న  లారీని  వెనుక నుండి  మరో వాహనం ఢీకొనడంతో  మంటలు చెలరేగాయి.  ఈ ప్రమాదంలో  హర్యానాకు చెందిన లారీ డ్రైవర్ ఫరియాజ్  చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. లారీ క్లీనర్  స్వల్ప గాయాలతో  బయటపడ్డాడు. ఈ ఘటన ఈ ఏడాది ఆగస్టు  27న చోటు చేసుకుంది.

హైద్రాబాద్ బీఎన్‌రెడ్డి నగర్ లో  అంబులెన్స్ అదుపు తప్పి  ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో  అంబులెన్స్ డీజీల్ ట్యాంకుకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో  అంబులెన్స్ డ్రైవర్  సజీవ దహనమయ్యాడు.ఈ ఘటన  ఈ ఏడాది జూలై  25న చోటు చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  నెల్లూరు జిల్లాలోని  దగదర్తి మండలం దామవరం జాతీయ రహదారిపై  లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీలో వంటకు ఉపయోగించే చిన్న సిలిండర్  కు మంటలు అంటుకున్నాయి. దీంతో  ఓ లారీ డ్రైవర్  సజీవ దహనమయ్యాడు. క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన చోటు చేసుకుంది.

 గత ఏడాది జూన్  6వ తేదీన సాలూరులో నిలిపి ఉన్న లారీలో  మంటలు వ్యాపించాయి. ఈ సమయంలో  లారీలో ఉన్న డ్రైవర్ కు మంటలు అంటుకుని అతను సజీవ దహనమయ్యాడు.  


 

click me!