
తెలంగాణలో ప్రధాన రాజకీయా పార్టీల మధ్య ముందస్తు ఎన్నికల సవాళ్లు కొనాసాగుతున్న సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీల నుంచి ముందస్తు మాటలు వినిపించడంతో.. ఇప్పుడు ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించిన సర్వే వివరాలు సంచనలంగా మారాయి. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని.. అయితే ఆ పార్టీ ఓట్ల శాతం తగ్గుతుందని పేర్కొంది.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ 8 శాతం ఓట్లను కోల్పోతుందని అంచనా వేసింది. అదే సమయంలో బీజేపీ ఓట్ షేర్ గణనీయంగా పెరుగుతుందని తెలిపింది. మరోవైపు కాంగ్రెస్ మరింతగా ఓటు షేర్‌ను నష్టపోతుందని పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌కు 38.88 శాతం ఓట్లు, బీజేపీకి 30.48 శాతం, కాంగ్రెస్‌కు 23.71 శాతం, ఇతరులకు 6.91 శాతం ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. అయితే తెలంగాణలో ఒకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. కూటమికి అవకాశం లేదని ఆ సర్వే పేర్కొంది.
ఈ సర్వేకు సంబంధించిన వివరాలను ఆరా సంస్థ డైరెక్టర్ షేక్ మస్తాన్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ సంస్థ పేరుతో కొన్ని సర్వేలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా తమ సంస్థ పేరును ప్రస్తావించడంతో తాను మీడియా ముందుకు వచ్చానన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకేసారి సర్వే చేయడం ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పారు. అయితే తమ సంస్థ 2021 నవంబర్ నుంచి మొత్తం 119 అసెంబ్లీ నియోజవర్గాల్లో మూడు దఫాలుగా సర్వే జరిపిందని మస్తాన్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 1,000 నమూనాలు తీసుకున్నట్టుగా చెప్పారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓట్ల శాతం.. 46.87 శాతం కాగా.. ఇప్పుడు 38.88 శాతానికి పడిపోవచ్చని సర్వే సూచించింది. వచ్చే ఎన్నికల నాటికి అది మరింత తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అయితే అత్యధిక శాతం ఓట్లను టీఆర్ఎస్ సొంతం చేసుకోనుంది. ఇక, టీఆర్‌ఎస్‌కు 87 మంది బలమైన అభ్యర్థులు, కాంగ్రెస్‌కు 53, బీజేపీకి 29 మంది అభ్యర్థులు ఉన్నారని అంచనా వేసింది. అయితే అధికార టీఆర్ఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపైన ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని సర్వే పేర్కొంది. వీరిలో 13 మంది గెలిచే అవకాశం లేదని.. మరో నలుగురు మాత్రం ప్రతిపక్ష పార్టీల నుంచి బలమైన అభ్యర్థలు లేకపోతే అదృష్టం కొద్ది విజయం సాధించే అవకాశం ఉందని తెలిపింది.
ఆసరా పింఛనుదారులు, తెలంగాణలోని ఆంధ్రా సెటిలర్‌లలో ఒక వర్గం టీఆర్ఎస్‌కు మద్దతుగా ఉన్నారని సర్వే పేర్కొంది. నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని సెటిలర్లు ప్రస్తుతం.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు, రాజకీయ పార్టీల మధ్య ఏర్పడే పొత్తుల వ్యవహారం ఆధారంగానే తెలంగాణలోని ఆంధ్రా సెటిలర్లు ఓట్లు పడే అవకాశం ఉందని సర్వే చెబుతోంది.
బీజేపీ పరిస్థితేమిటి..?
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 6.93 శాతం ఓట్లను మాత్రమే సాధించిన కాషాయ పార్టీ ప్రస్తుత రాజకీయ పరిణామాలతో భారీగా పుంజుకున్నట్టుగా సర్వే పేర్కొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ 30.48 శాతం ఓట్లను సాధిస్తుందని తెలిపింది. అయితే ఈ వార్త బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
అయితే 2018 ఎన్నికలలో 28.78 శాతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం.. 5 శాతం తగ్గి 23.71 శాతానికి చేరుతుందని సర్వే అంచనా వేసింది. ఇది కాంగ్రెస్ మరింతగా ప్రాబల్యాన్ని కోల్పోతున్నట్లుగా సూచిస్తుంది. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చినట్లు సర్వేలో గుర్తించామమని మస్తాన్ తెలిపారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది టీఆర్ఎస్ కండువా కప్పుకోవడంతో ప్రజల్లో ఆ పార్టీపై విశ్వాసం తగ్గిపోతుందని చెప్పారు.
ఇక, తెలంగాణలో బీఎస్పీ బలం పుంజుకుంటుందనేది ఇక్కడ ఆసక్తికర పరిణామంగా చెప్పవచ్చు. బీఎస్పీ ప్రతి నియోజకవర్గంలో 3-5 శాతం ఓట్ షేర్‌తో.. 5 శాతం ఓట్ల వాటాను దక్కించుకుంటుందని సర్వే అంచనా వేసింది. ఎక్కువగా దళిత వర్గాల నుంచి ఓట్లు పొందుతుందని అంచనా వేసింది. మరోవైపు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వైఎస్‌ఆర్‌టీపీకి ప్రజల్లో కొంత ఆదరణ లభిస్తోందని సర్వే తేలింది. ఆ జిల్లాల్లో షర్మిల పార్టీకి దళితుల మద్దతు కూడా లభించనుందని పేర్కొంది.
జిల్లాల వారీగా పార్టీల పరిస్థితి
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య పోరు ఉండబోతుందని సర్వే పేర్కొంది. ఇక్కడ టీఆర్‌ఎస్‌కు 39 శాతం ఓట్లు, బీజేపీకి 35 శాతం, కాంగ్రెస్‌కు 18.91 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య పోరు సాగుతుందని సర్వే తెలిపింది. మరోవైపు ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ముక్కోణపు పోరు ఉంటుందని సర్వే అంచనా వేసింది.
-కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం వల్ల ఓటర్లు బిజెపి వైపు మొగ్గుచూపుతున్నారని మస్తాన్ చెప్పారు. కుల, మతాలకు అతీతంగా 18 నుంచి 35 ఏళ్లలోపు యువత ఎక్కువగా బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు.
-ఆంధ్రా సెటిలర్లు ఇప్పటికీ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు ఓటు వేయడానికి ఇష్టపడుతున్నారని.. అయితే భవిష్యత్తులో ఏపీలో కొత్త రాజకీయ పొత్తుల ద్వారా పరిణామాలు మారే అవకాశం ఉందని మస్తాన్ అన్నారు. ఉత్తర భారత సెటిలర్లలో 80 శాతం మంది బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు.
-కేసీఆర్ కుటుంబంలో అధికార కేంద్రీకరణ, అవినీతి ఆరోపణలే ఎన్నికలలో ప్రధానంగా అంశంగా నిలిచే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.
- మలక్‌పేట, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎంపై బీజేపీ గట్టిపోటీనిస్తుందని సర్వే అంచనా వేసింది.
- 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లాగా ఒక్క వ్యక్తిని చూసి ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదని సర్వే పేర్కొంది.
-మహిళలు, పెన్షనర్లు ఇప్పటికీ టీఆర్‌ఎస్‌కు అండగా ఉన్నారని సర్వే తెలిపింది.