బతుకమ్మ మంటల వెనుక కాంగ్రెస్ ?

First Published Sep 18, 2017, 5:15 PM IST
Highlights
  • టిఆర్ఎస్ వర్గాల ఆరోపణ
  • కేటిఆర్ ప్రకటన కూడా
  • వీడియోల్లో కాంగ్రెస్ నేతలు కనిపిస్తున్నారని విమర్శ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ మంటలు రేపింది. మహిళలు తిట్లు, శాపనార్థాలు పెట్టడం, చీరలు కాలబెట్టడం జరిగాయి. అయితే మహిళలు స్వచ్ఛందంగానే అలా నిరసన తెలిపలేదని, ఆ మంటల వెనుక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని టిఆర్ఎస్ అంచనా వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కావాలనే చీరలు కాల్చిపిచ్చిందని టిఆర్ఎస్ నాయకత్వం అంచనాకొచ్చింది.

ఈ విషయమై మంత్రి కేటిఆర్ స్పందించారు. మంచి ఉద్దేశంతోటే చీరల పంపిణీ చేపట్టినట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దురుద్దేశపూర్వకంగా చీరలు తగలబెట్టించి రాక్షసానందం పొందుతోందని ఆయన విమర్శించారు. మహిళలు ఎవరూ చీరలు తగలబెట్టే ఉద్దేశంతో ఉండరని, కేవలం కాంగ్రెస్ పార్టీ రాజకీయాల వల్లే చీరల మంటలు రేగినాయన్నారు.

చీరలు కాలబెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో చర్కర్లు కొట్టాయి. వాట్సాప్, ఫేస్ బుక్ తో పాటు  టివి చానెళ్లు కూడా పోటీ పడి చీరల మంటల వార్తలు అందించాయి. చీరల నిరసన కార్యక్రమాల్లో నిజానికి మహిళలే ఉంటే ఆ నిరసన కార్యక్రమాలపై విమర్శలు వచ్చే చాన్స్ లేదని, కానీ కొన్నిచోట్ల కాంగ్రెస్ నేతలు దగ్గరుండి మరీ చీరలను కాలబెట్టించారని అధికార పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు.

ఇదిలా ఉండగా చేనేత రంగాన్ని కాపాడేందుకు, నేత కార్మికులను రక్షించేందుకు బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టినట్లు చెప్పిన ప్రభుత్వం వంద రూపాయలు కూడా విలువ చేయని సిల్క్ చీరలు ఎందుకు పంపిణీ చేశారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. మహిళలు చీరలు అడగకపోయినా ఇచ్చారని, ఆ ఇచ్చేదేదో మంచి చీరలు ఇవ్వొచ్చు కదా కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.

మొత్తానికి బతుకమ్మ చీరల పంపిణీ తెలంగాణలో మంటలు రేపింది. రాజకీయాల్లో మరింత మంటలు రగిలించింది.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

click me!