
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనపై రాజకీయ రగడ మొదలైంది. మోడీ తెలంగాణ పర్యటనపై ప్రశ్నలు సంధించింది టీఆర్ఎస్ పార్టీ. ‘‘ ఉత్త చేతులతో వస్తారా..? ఏమైనా తెస్తారా’’ అంటూ ట్వీట్ చేసింది. రాష్ట్రానికి చేసిన అన్యాయాలపై ఏం చెబుతారని ప్రశ్నించింది. విభజన హామీల అమలు సంగతి ఏంటని నిలదీసింది. నీతి అయోగ్ చెప్పిన నిధుల విడుదల ఎప్పుడంటూ తెలంగాణ సమాజం నిగ్గదీసి అడుగుతోందని దుయ్యబట్టింది టీఆర్ఎస్. ఈ నెల 12న ప్రధాని మోడీ ప్రారంభించే రామగుండం ఎరువుల కార్మాగారం కార్యక్రమం ఆహ్వానంలో కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని మండిపడింది టీఆర్ఎస్. తెలంగాణ ప్రజలను మోడీ ప్రభుత్వం అవమానించిందని అధికార పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ALso Read:తెలంగాణ నుండి తమిళిసై వెళ్లిపోవాలి: సీపీఐ కార్యదర్శి కూనంనేని
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనపై విమర్శలు గుప్పించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ప్రధానికి తెలంగాణపై అనుకోని ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు.దురుద్దేశ్యంతోనే మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారని ఆయన విమర్శించారు.గత ఏడాది ప్రారంభమైన ఫ్యాక్టరీని ఇప్పుడు ప్రారంభించేందుకు రావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.మోడీ పర్యటనను అడ్డుకొంటామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ఒక్కటి కూడ నెరవేర్చలేదని కూనంనేని సాంబశివరావు తెలిపారు.ఈ నెల 10వ తేదీ నుండి సింగరేణి బొగ్గు గనుల్లో ఆందోళనలు చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రధాని రాష్ట్రానికి రావడానికి వీల్లేదని ప్రచారం చేస్తామన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ నిర్వీర్యం చేసిందని కూనంనేని విమర్శించారు.