
టీఆర్ఎస్ పార్టీ సెప్టెంబర్ 2వ తేదీ ఆదివారం రోజున కొంగరకలాన్ లో ప్రగతి నివేదన సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ సభ నేపథ్యంలో అవుటర్ రింగ్ రోడ్డుపై కొన్ని ఆంక్షలు విధించారు. ఔటర్ రింగ్ రోడ్డుపైకి ద్విచక్ర వాహనాలను, ట్రాక్టర్లను అనుమతించబోమని రాచకొండ సీపీ మహేశ్ భగవత్, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు.
ప్రగతి నివేదన సభా ప్రాంగణంలో మహేశ్ భగవత్, జితేందర్ కలిసి మీడియాతో మాట్లాడారు. పార్కింగ్ కోసం వెయ్యికి పైగా ఎకరాలు కేటాయించామని తెలిపారు. వాహనాలను పార్కింగ్ స్థలాల్లోనే నిలపాలని కోరారు. సభా వేదిక వద్దకు వాహనాలు వెళ్లాల్సిన మార్గాల గురించి ఇప్పటికే వివరంగా చెప్పామన్న వారు.. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ట్రాక్టర్లను ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే ఓఆర్‌ఆర్ పరిధిలోకి అనుమతిస్తాం. రేపు ట్రాక్టర్లను ఓఆర్‌ఆర్ లోపలికి అనుమతించమని స్పష్టం చేశారు. అత్యవసర వాహనాలకు అందరూ దారి వదిలి సహకరించాలి. దాదాపు 20 వేల మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉన్నారని చెప్పారు. వాహనాలు స్తంభించకుండా, భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ట్రాక్టర్ల కోసం ఫ్యాబ్ సిటీలో పార్కింగ్ ఏర్పాట్లు చేశామని తెలిపారు.