పొత్తు పొడుపు: టీడీపికి కాంగ్రెసు ఇచ్చే సీట్లు ఇవే...

By pratap reddyFirst Published Sep 1, 2018, 12:55 PM IST
Highlights

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు పొడిచి, సీట్ల పంపకం దాకా వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నట్లు చెబుతున్నారు.

హైదరాబాద్: కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు పొడిచి, సీట్ల పంపకం దాకా వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నట్లు చెబుతున్నారు. తమకు 30 శాసనసభ స్థానాలు, ఐదు లోకసభ స్థానాలు ఇవ్వాలని టీడీపీ ప్రతిపాదించినట్లు, చివరకు 15 అసెంబ్లీ స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. 

రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కాస్తా ఎక్కువగా, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒకటి, రెండు స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెసు సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్ర సెటిలర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న హైదరాబాదు శివారులోని నియోజకవర్గాలను టీడీపికి ఇచ్చేందుకు కాంగ్రెసు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. 

కూకట్ పల్లి, శేర్ లింగంపల్లి, మేడ్చల్, మల్కాజిగిరి శాసనసభ నియోజకవర్గాలను కాంగ్రెసు టీడీపికి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. సత్తుపల్లి నియోజకవర్గాన్ని టీడీపికి కేటాయించేందుకు కాంగ్రెసు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున సండ్ర వెంకట వీరయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

జగిత్యాల (ఎల్ రమణ), వనపర్తి లేదా దేవరకద్ర (రావుల చంద్రశేఖర రెడ్డి), మక్తల్ (కొత్తకోట దయాకర్ రెడ్డి), నిజామాబాద్ రూరల్ (మండవ వెంకటేశ్వర రావు), బాల్కొండ లేదా ఆర్మూర్ (అన్నపూర్ణమ్మ), నర్సంపేట లేదా పరకాల ((రేవూరి ప్రకాశ్ రెడ్డి) సీట్లను తమకు కేటాయించాలని టీడీపి అడుగుతోందని సమాచారం. ఈ సీట్లలో కాంగ్రెసు కీలక నేతలు జీవన్ రెడ్డి, చిన్నా రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలున్నాయి. 

మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల స్థానాన్ని టీడీపి కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే, మల్లు రవిని నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయిస్తే ఆ సీటును టీడీపికి ఇచ్చేందుకు కాంగ్రెసుకు అభ్యంతరం ఉండకపోవచ్చునని అంటున్నారు. 

సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి బొల్లం మల్లయ్య యాదవ్ కోసం టీడీపి పట్టు పడుతోందని అంటున్నారు. అయితే, అక్కడి నుంచి టీపీసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమా రెడ్డి భార్య పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగిత్యాల సీటు నుంచి కాంగ్రెసు నేత జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది టీడీపికి కేటాయించడం అంత సులభం కాదని అంటున్నారు. 

కాగా, ఖమ్మం లోకసభ స్థానాన్ని టీడీపికి ఇచ్చేందుకు కాంగ్రెసు దాదాపుగా అంగీకరించినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం నుంచి నామా నాగేశ్వర రావు ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. అవసరమైతే మల్కాజిగిరి లోకసభ స్థానాన్ని కూడా టీడీపికి కేటాయించే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. మొత్తం మీద, ఇరు పార్టీలు కేసిఆర్ ను ఎదుర్కునే క్రమంలో కాంగ్రెసు, టీడీపి అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.

click me!