
TRS MPs: కోట్లాది తెలంగాణ ప్రజల పోరాటాన్ని ప్రధాని మోడీ అవమానించారని తెరాస ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేండ్ల క్రితం సాధించుకున్న తెలంగాణ గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదంలో అశాస్త్రీయం ఏముందో చెప్పాలని డిమాండ్ చేశారు. లాఠీఛార్జ్, కాల్పుల వంటి ఘటనలేవీ జరగకుండా కేవలం రాష్ట్ర ప్రజల పోరాటంతోనే తెలంగాణ సాధించుకున్నామని స్పష్టం చేశారు. మోదీ వ్యాఖ్యలను ఖండిస్తూ పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద తెరాస ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదంలో అశాస్త్రీయం ఏముందో భాజపా చెప్పాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు డిమాండ్ చేశారు. అన్ని పార్టీలూ మద్దుతు ఇచ్చిన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. 2/3 మెజార్టీ చూసిన తర్వాతే బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారని చెప్పారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే చాలా బిల్లులను చర్చించకుండానే ఆమోదిస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీ అసందర్భంగా తెలంగాణ ఏర్పాటును ప్రస్తావించారని అన్నారు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లవుతోందన్న కేకే.. నాటి ఘటనను మోదీ ఇప్పుడెందుకు గుర్తు చేశారని నిలదీశారు. మోదీ తెలంగాణ ప్రజలను అవమానించారని మండిపడ్డారు. రాజకీయంగా భాజపా దిగజారిపోయిందని అన్నారు. లాఠీఛార్జ్, కాల్పులు వంటి ఘటనలు జరగకుండా రాష్ట్రం సాకారమైందని చెప్పారు.
ఎన్నో ఏళ్ల ఉద్యమం ద్వారా తెలంగాణ సాకారమైంది. విస్తృత అధ్యయనం తర్వాతే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. కీలక బిల్లుపై ఓటింగ్ జరిగితే సభ్యుల లెక్కింపు తప్పక జరగుతుంది. రాష్ట్ర విభజన బిల్లుకు భాజపా మద్దతు ఇచ్చింది. అధికార, విపక్ష పార్టీలు బిల్లుకు మద్దతు ఇచ్చినప్పుడు సంఖ్యాబలం సమస్య ఉత్పన్నం కాదు. ఉభయ సభల ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన బిల్లు ఆశాస్త్రీయం ఎలా అవుతుంది? ఝార్ఖండ్ బిల్లు ఆమోదం సమయంలో కొందరు సభ్యులు వాజ్‌పేయీ మీదకు దూసుకెళ్లారు. రాష్ట్రాల విభజన అనేది భావోద్వేగాలతో కూడినది అని కేశవ రావు పేర్కొన్నారు.
ప్రజల పోరాటాన్ని అవమానించారు
కోట్లాది తెలంగాణ ప్రజల పోరాటాన్ని ప్రధాని మోదీ అవమానించారని తెరాస లోక్‌సభా పక్షనేత నామ నాగేశ్వరరావు అన్నారు. చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడారని మండిపడ్డారు. ఎన్డీఏ 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడే తెలంగాణను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఈ 8 ఏళ్లలో భాజపా సర్కార్ తెలంగాణకు ఏమైనా చేసిందా అని నిలదీశారు. పార్లమెంటులో గాంధీ విగ్రహం వద్ద తెరాస ఎంపీల నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని వ్యాఖ్యలను ఖండిస్తూ ఆందోళనకు దిగారు.
తెలంగాణ అభివృద్ధి చూసి ఓర్వలేకే
'భాజపా నేతలు తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు. పార్లమెంటు సాక్షిగా ఏర్పడిన తెలంగాణను అవమానిస్తున్నారు. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతోంది. తెలంగాణ సాధించడానికి కేసీఆర్ 17 ఏళ్లు పోరాడారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలంతా రోడ్లమీదకు వచ్చి ఉద్యమించారు. కోట్లాది తెలంగాణ ప్రజల పోరాటాన్ని మోదీ అవమానించారు అని నమా నాగేశ్వర రావు పేర్కొన్నారు.