
కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ ఎంపీ (trs) నామా నాగేశ్వరరావు (nama nageswara rao) ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణ భాగం కాదనే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో లేనంతగా ఎక్కువ పంట తెలంగాణలో పండిందని కానీ కేంద్రం కొనకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు . తెలంగాణలో ఎలా పండుతుందంటూ కేంద్రం వితండవాదం చేస్తోందంటూ ఎద్దేవా చేశారు. కేంద్రం గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఒక్క నవోదయా పాఠశాల (navodaya schools) కూడా ఇవ్వలేదని నామా నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.
తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజలను కేంద్ర మంత్రులు అవమానకరమైన రీతిలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ముందు మీరు నూకలు తినండంటూ కేంద్ర మంత్రి అవమానిస్తున్నారని నాగేశ్వరరావు ఫైరయ్యారు. రైతాంగ సమస్యలపై చివరివరకూ పోరాడదామని కేసీఆర్ చెప్పారని ఎంపీ అన్నారు. కేంద్రం తెలంగాణ పట్ల దుర్మార్గంగా కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంపై రాజీలేని రీతిలో పోరాటం చేస్తామని నామా హెచ్చరించారు.
అంతకుముందు నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. రాజ్యసభలో రూల్ 222 కింద ఈ అంశాన్ని చర్చించాలని వాయిదా తీర్మానంలో టీఆర్ఎస్ నేత ఎంపీ కే కేశవ రావు కోరారు. ఇదే అంశాన్ని చర్చించాలని Loksabha లో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థ నవోదయ విద్యాలయ సమితి అనే విషయాన్ని టీఆర్ఎస్ ఎంపీలు గుర్తు చేశారు. దేశంలోని అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడం తప్పనిసరి. ఈ విద్యాలయాలు నాణ్యమైన విద్యలో అగ్రగామిగా ఉన్నాయి.
రాష్ట్రాలలోని ఇతర సంస్థలకు ఇవి ఆదర్శంగా పనిచేస్తాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల ప్రకటన జరిగింది. నవోదయ విద్యాలయాల స్థాపన విద్యా రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అకడమిక్ ఎక్సలెన్స్ కోసం ఆ విద్యాలయాల ఏర్పాటు తప్పనిసరి. నూతన విద్యా సంవత్సరం అమలులోకి వస్తున్నందున ఈ అంశం చాలా ముఖ్యమైనదని వాయిదా తీర్మానంలో కేశవరావు, నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు.
పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతి రోజూ కేంద్రం తీరుపై నిరసనకు దిగాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగుతున్నారు. వరి ధాన్యం కొనుగోలుతో పాటు రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాలను పార్లమెంట్ వేదికగా ఎత్తి చూపేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేసింది. వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. అయితే కేంద్రం నుండి సానుకూల స్పందన రాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఆందోళనలకు ప్లాన్ చేస్తుంది.