
తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బాయిల్డ్ రైస్‌కు ఆదరణ లేదని.. ఎవరూ ఉపయోగించరని అన్నారు. ఆయా రాష్ట్రాలు బాయిల్డ్ రైస్ ఉత్పత్తి తగ్గించాయని చెప్పారు. నాలుగైదు ఏళ్లుగా బాయిల్డ్ రైస్‌ను వినియోగించడంలేదని, తగ్గించుకుంటున్నారని చెప్పారు. ధాన్యం సేకరణకు 2014లో కేంద్ర ప్రభుత్వం రూ. 3,400 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. అదే గతేడాది ధాన్యం సేకరణకు కేంద్రం రూ. 26,000 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ఇంకా ముడి బియ్యం ఇవ్వలేదని కిషన్ రెడ్డి చెప్పారు. హుజురాబాద్ ఎన్నికల తర్వాతే బాయిల్డ్ రైస్ అంశం తెరపైకి వచ్చిందన్నారు. గత ఒప్పందాల ప్రకారం చివరి గింజ వరకు కొంటామని వెల్లడించారు. దేశంలో ముడి బియ్యం స్టాక్ పేరుకుపోతుందని కిషన్ రెడ్డి చెప్పారు. రాజకీయాల కోసం ధాన్యం కొంటే ప్రజాధనం వృథా అవుతుందన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రధాని గడ్డం, బట్టలపై విమర్శలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్, రష్యా యుద్దం కారణంగా అన్ని ధరలు పెరుగుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వొచ్చు.. కానీ ఎంతమేర సబ్సిడీ ఇవ్వగలం అని ప్రశ్నించారు. రాజకీయ పార్టీ కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టలేదని.. ప్రజల కోసం బడ్జెట్ పెట్టామని కిషన్ రెడ్డి తెలిపారు.
ఇదిలా ఉంటే మరోవైపు ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్‌ఎస్ నేతలు.. కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ నేతలు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే Balka Suman విమర్శించారు. ఆదివారం నాడు టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో రైతులకు ఇప్పుడు ఏం చెబుతారని బండి సంజయ్ ను బాల్క సుమన్ ప్రశ్నించారు. దేశం మొత్తం ఒకే విధానం ఉండాలని చెప్పే BJP నేతలు అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన Paddy ధాన్యం సేకరణ విధానం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరు దుర్మార్గంగా ఉందని ఆయన చెప్పారు. యాసంగిలో వరి ధాన్యం పండించవద్దని తాము రైతులను కోరిన విషయాన్ని బాల్క సుమన్ చెప్పారు. యాసంగిలో వరి ధాన్యానికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని తాము కోరిన విషయాన్ని సుమన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.అయితే రైతాంగాన్ని BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుBandi Sanjay రెచ్చగొట్టి వరి ధాన్యం కొనుగోలు చేసేలా ప్రేరేపించారని సుమన్ మండి పడ్డారు. ఈ మేరకు ఓ వీడియో క్లిప్పింగ్ ను మీడియాకు చూపారు.
యాసంగిలో ఎంత వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందనే విషయమై ప్రణాళికను సిద్దం చేసుకోవాలని బండి సంజయ్ కేసీఆర్ కోరిన మరో వీడియోను సుమన్ మీడియా సమావేశంలో ప్రదర్శించారు. యాసంగిలో ఎంత ధాన్యం కేంద్రానికి ఇస్తారో కేంద్రానికి లేఖ రాయాలని కూడా సంజయ్ కోరారు. వరి ధాన్యం కొనుగోలు చేయడాన్ని తమ పార్టీ బాధ్యత తీసకొంటామని సంజయ్ మాట్లాడారన్నారు.
యాసంగిలో వరి ధాన్యం వేయవద్దని తాము చెప్పినా కూడా బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టారన్నారు. కానీ ఇప్పుడేమో వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెబుతుందన్నారు. కానీ ఈ విషయమై బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.