ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత రాములు నాయక్ రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం.
హైదరాబాద్: ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత రాములు నాయక్ రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం. మెదక్ జిల్లా నారాయణఖేడ్ టిక్కెట్టును రాములు నాయక్ ఆశిస్తున్నారు. టీఆర్ఎస్ ఇప్పటికే నారాయణఖేడ్ టిక్కెట్టును ఖరారు చేసిన నేపథ్యంలో రాములునాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా సమాచారం.
ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం హైద్రాబాద్ గోల్కొండ హోటల్ లో జరిగింది.ఈ సమావేశం జరిగే సమయంలోనే రాములునాయక్ ఈ హోటల్ వద్దకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియాతో పాటు, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో రాములు నాయక్ సమావేశమయ్యారు.
హోటల్‌లో ఉన్న తన స్నేహితుడిని కలిసేందుకే వచ్చినట్టు ఆదివారం నాడు మీడియా ప్రతినిధులతో రాములు నాయక్ చెప్పి వెళ్లిపోయారు. కుంతియాతో చర్చించేందుకే రాములు నాయక్ అక్కడికి వచ్చారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఖమ్మం జిల్లా ఇల్లెందు నుండి పోటీ చేయాలని రాములు నాయక్‌ను కాంగ్రెస్ పార్టీ కోరినట్టు సమాచారం. ఇల్లెందు లేకపోతే భద్రాచలం అసెంబ్లీ టిక్కెట్టును ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించిందని సమాచారం.
భద్రాచలం సీటును రాములునాయక్ కు ఇచ్చేందుకే ఆ పార్టీ నేతలు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. సోమవారం నాడు మధ్యాహ్నం రాములునాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో తాను ఏ పరిస్థితుల్లో పార్టీని వీడాల్సి వస్తోందననే విషయాన్ని వివరించే అవకాశం లేకపోలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.