మొయినాబాద్ ఫాం హౌస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో జగ్గుస్వామికి మంగళవారంనాడు సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్: మొయినాబాద్ ఫాం హౌస్ లో ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో జగ్గుస్వామికి మంగళవారంనాడు సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో నిన్న సిట్ విచారణకు జగ్గుస్వామి, బీఎల్ సంతోష్, తుషార్ లు హాజరు కావాల్సి ఉంది. ఈ ముగ్గురు కూడా విచారణకు రాలేదు. ఈ విషయమై సిట్ అధికారులు న్యాయ సలహ తీసుకోవాలని భావించారు. ఇవాళ జగ్గుస్వామికి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అయితే జగ్గుస్వామితో పాటు బీఎల్ సంతోష్ , తుసార్ లకు కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసిందని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అయితే ఈ ప్రచారంల్ వాస్తవం లేదని తేలింది. బీఎల్ సంతోష్ , తుసార్ లకు లుకౌట్ నోటీసులు జారీ చేశారని తప్పుడు వార్తలు ప్రసారం చేయడంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కొందరు టీఆర్ఎస్ నేతలు ఈ విషయమై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ఈ ఏడాది అక్టోబర్ 26న మొయినాబాద్ ఫాం హౌస్ లో ఎమ్మెల్యేల ను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
also read:ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: ఆ ముగ్గురి విషయంలో న్యాయ సలహా తీసుకుంటున్న సిట్
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ఈ ముగ్గురు నిందితులు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యేల ప్రలోభాల వెనుక బీజేపీ ఉందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది.
ఈ కేసును విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ ఈ కేసును విచారిస్తున్నారు. సిట్ బృందం కర్ణాటక, కేరళ, హర్యానా, ఏపీ రాష్ట్రాల్లో గత వారంలో సోదాలు నిర్వహించి కీలక సమాచారాన్ని సేకరించింది.
నల్గొండ ఎస్పీ రాజేశ్వరి నేతృత్వంలో కేరళ రాష్ట్రంలో సోదాలు నిర్వహించిన సిట్ బృందం ఈ కేసులో కీలక సమాచారాన్ని సేకరించింది. సిట్ బృందం వచ్చిన సమాచారం తెలుసుకున్న జగ్గుస్వామి పారిపోయాడు. తుషార్ కి రామచంద్రభారతికి జగ్గుస్వామి మధ్యవర్తిగా వ్యవహరించాడనే ఆరోపణలున్నాయి. ఈ విషయమై విచారణ చేసేందుకు గాను జగ్గుస్వామి కోసం సిట్ ప్రయత్నించింది. కానీ అతను సిట్ బృందానికి తారసపడలేదు. జగ్గుస్వామి ఆశ్రమంలో నోటీసులు అంటించింది సిట్ బృందం. మరో వైపు తుషార్, బీఎల్ సంతోష్ లకు కూడా సిట్ బృందం నోటీసులు ఇచ్చింది.ఈ ముగ్గురు నిన్ననే విచారణకు రావాల్సి ఉంది. కానీ విచారణకు రాలేదు.
ఈ కేసులో సిట్ విచారణకే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ కేసును సీబీఐతో విచారణను హైకోర్టు తోసిపుచ్చింది. సిట్ విచారణకే హైకోర్టు మొగ్గుచూపింది. ఇదే అభిప్రాయంతో సుప్రీంకోర్టు ఏకీభవించింది.