
తెలంగాణలోని ఒక ఎమ్మెల్యే పూజల వివాదంలో చిక్కుకుపోయారు. మంత్రి పదవి కోసం ఆయన పూజలు చేపించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. పూజలు చేస్తే మంత్రి పదవులు ఎలా వస్తాయా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. దీంతో ఆ ఎమ్మెల్యే నోరు విప్పాల్సిన అనివార్యత ఏర్పడింది.
ప్రజా చైతన్యానికి మారుపేరుగా నిలిచిన జిల్లా వరంగల్. అటువంటి వరంగల్ రూరల్ జిల్లాలో చిత్రమైన సంఘటన జరిగింది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రహస్య పూజలు జరిపించారని ప్రచారం జోరందుకుంది. అయితే తనకు మంత్రి పదవి కోసమే పూజలు చేసినట్లు జిల్లాలో టాక్ నడుస్తోంది. కోయ దొరలు ఈ పూజలు చేశారని, వారికి భోజనం, దక్షిణ భారీగానే సమర్పించుకున్నారని చెబుతున్నారు. ఒక్క పైసా కాదు రెండు పైసలు కాదు ఏకంగా 57 లక్షల రూపాయలు ఆ కోయ దొరలకు కానుకగా చెల్లించారట సదరు ఎమ్మెల్యే మనుషులు. ఈ పూజలు ఒకేసారి కాకుండా దశల వారీగా జరిపించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఈ వార్త ఈనోటా ఆనోటా వినిపించడంతో రాష్ట్రమంతా పాకింది. దీంతో ఎమ్మెల్యే నోరు తెరిచారు. తన మంత్రి పదవి కోసం పూజలు చేయలేదని, తన కూతరు ఆరోగ్యం కోసమే చేయించుకున్నారని వివరణ ఇచ్చారు చల్లా ధర్మారెడ్డి. మరోవైపు తన కుటుంబసభ్యులను బురిడీ కొట్టించారంటూ కోయ దొరల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు చల్లా మనుషులు. మొత్తానికి చల్లా పూజల వ్యవహారం వివాదాస్పదంగా మారింది.