
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు మరో షాక్ తగిలే వార్త ఇది. డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీ విషయంలో హైకోర్టు స్టే ఇచ్చింది. ఈనెల 30వ తేదీన డిగ్రీ లెక్చరర్స్ పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. అయితే టిఎస్సీఎస్సీ ఇచ్చిన ఈ నోటిఫికేషన్ రాజ్యాంగ వ్యతిరేకం అయినందున దాన్ని నిలిపివేయాలని నిరుద్యోగులు హైకోర్టు తలుపు తట్టారు. సోమవారం నిరుద్యోగుల తరుపున అడ్వొకెట్ బూర రమేష్ గౌడ్ వాదనలు వినిపించారు.
నిజానికి ఈనెల 16వ తేదీన డిగ్రీ లెక్చరర్స్ పోస్టుల భర్తీకి ప్రిలమ్స్ పరీక్ష జరగాల్సి ఉంది. కానీ సమయం మరింత కావాలంటూ అభ్యర్థులు ఆందోళన చేయడంతో ఈనెల 30వ తేదీకి పరీక్షను వాయిదా వేశారు. అయితే ఈ పోస్టుల భర్తీలో మగవారి పట్ల వివక్ష చూపడం సరికాదని పురుష అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణ సర్కారు ఇచ్చిన జిఓ 1274 చెల్లుబాటు కాదని, లింగ వివక్ష చూపేలా ఉందని నిరుద్యోగుల తరుపు న్యాయవాది రమేష్ గౌడ్ వాదించారు. దీంతో గురుకుల డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీపై హైకోర్టు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సర్కారును, టిఎస్పీఎస్సీని ఆదేశించింది హైకోర్టు.
టిజిటి, పిజిటి పోస్టుల విషయంలో కూడా లింగ వివక్ష కొనసాగుతోందని, వాటి పైనా న్యాయ పోరాటం చేస్తామని నిరుద్యోగ జెఎసి నేత కోటూరి మానవత్ రాయ్ తెలిపారు. మగవారు ఉద్యోగాలు చేయడం తెలంగాణ సర్కారుకు, గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీన్ కుమార్ కు అసలే నచ్చడంలేదని ఆరోపించారు. అన్ని పోస్టులు మహిళకే కేటాయించాలనుకోవడం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అంతగా మహిళకు ఉద్యోగాలివ్వాలనుకుంటే తెలంగాణ కేబినెట్ లో వారికి 33 శాతం అమలు చేయవచ్చుగదా అని ఎద్దేవా చేశారు కోటూరి.