మా కాళ్ల మీద పడ్డారు: టీజీ వెంకటేష్ పై మండిపడిన కేకే

First Published Jun 21, 2018, 12:56 PM IST
Highlights

టీజీ వెంకటేష్ పిచ్చోడని, అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేకే వ్యాఖ్యానించారు. 

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేతలు మండిపడుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోరాటంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చేతులు కలపాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సూచించిన విషయం తెలిసిందే.

టీజీ వెంకటేష్ తెలివి లేకుండా మాట్లాడుతున్నారని రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై టీజీ వాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీజీ వెంకటేష్ ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసునని ఆయన అన్నారు.

టీజీ వెంకటేష్ పిచ్చోడని, అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేకే వ్యాఖ్యానించారు. టీజీ వెంకటేష్ కు మతిస్థిమితం లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీరాలు పలికారు. రాష్ట్రం సాధించిన తర్వాత తమ కాళ్ల మీద పడ్డారని ఆయన టీజీని ఉద్దేశించి అన్నారు.
 
టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించాలని తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుకు చంద్రబాబు అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాను టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించలేదని ఆయన చెప్పారు.

click me!