
శ్రీవారి ఆభరణాలు చోరీకి గురయ్యాయన్న ఆరోపణలపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్ చేశారు. టిటిడి మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు శ్రీవారికి అలంకరించే ఓ ఆభరణంలోని పింక్ డైమండ్ తో పాటు మరిన్ని ఆభరణాలు మాయమయ్యాయని తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ స్పందించారు.
శ్రీవారి ఆభరణాలు మాయమైన విషయం తనకు కొన్నేళ్ల క్రితమే తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్. ఓ ఐపిఎస్ ఉన్నతాధికారి తనను ఎయిర్ పోర్టులో కలిసినపుడు ఈ చోరీ విషయం గురించి చెప్పారన్నారు. ఈ ఆభరణాలను ప్రత్యేక విమానంలో మధ్యప్రాచ్య ప్రాంతంలోని ఓ దేశానికి చేరవేశారని ఆ ఐపిఎస్ తెలిపాడని పవన్ అన్నారు. ఈ విషయం టిడిపి నాయకులకు కూడా తెలుసని పవన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
అందువల్లే రమణ దీక్షితులు శ్రీవారి ఆభరణాలు మాయమయ్యాయని చెప్పినపుడు తానేమీ ఆశ్చర్యానికి లోనవలేదని పవన్ అన్నారు. ఈ దొంగలు వెంటేశ్వర స్వామి మౌనంగా ఉన్నాడని అనునుకుంటున్నారని, ఏదో రోజు ఆయనే వీరిని శిక్షిస్తాడని పవన్ హెచ్చరించాడు.
ఇక మరో ట్వీట్ లో పవన్ ''గులాబీ రంగు వజ్రంతోపాటు విలువైన ఆభరణాలు మాయమైనట్టు టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు లేవనెత్తిన అంశంపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదు'' అంటూ విమర్శించారు. ‘భక్తులు విసిరిన నాణేలుకు గులాబీ రంగు వజ్రం ముక్కలైందని అంటున్నారు. అందులో ఉన్న నిజమెంతో భక్తులుగా తెలుసుకోవాలనుకుంటున్నాం. అలాంటప్పుడు ఆ శకలాలను ఎందుకు ఫోరెన్సిక్ నిపుణులతో పరీక్షించడం లేదు. మరి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలనే సామెత కూడా ఉంది కదా’అంటూ పవన్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.