
హైదరాబాద్: పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ నిప్పులు చెరిగారు. తనపై ఉత్తమ్ చేసిన భూకబ్జా ఆరోపణలను నిరూపించాలని దానం సవాల్ విసిరారు. తాను భూక్జాలకు పాల్పడినట్లు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని దానం స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖేల్ కతం అవ్వడం ఖాయమన్నారు. తనపై భూకబ్జా ఆరోపణలు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోర్టుకు లాగుతానని హెచ్చరించారు.
మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ జెండా మోసారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకోసం తాము పోరాటాలు చేశామని...జైలుకు వెళ్లామని గుర్తు చేశారు. ఉత్తమ్ ఎప్పుడైనా జైలుకెళ్లాడా...లాఠీదెబ్బలు తిన్నాడా అని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పటి రాష్ట్రపతి రికమండేషన్ తో టిక్కెట్ తెచ్చుకున్నారని విమర్శించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిస్తుందని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. తనకు క్యారెక్టర్ లేకుంటే ఇన్నాళ్లు ఉత్తమ్ తనను ఎందుకు పక్కనబెట్టుకున్నారో చెప్పాలన్నారు.
ఎన్నికల తర్వాత ఉత్తమ్‌ను గాంధీభవన్ మెట్లు కూడా ఎక్కనివ్వరని ఎద్దేవా చేశారు. మరోవైపు కాంగ్రెస్ లో డీఎస్ కు ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదన్నారు. అయితే కేసీఆర్ ఎంపీ పదవి ఇచ్చారన్నా విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.