
తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ముందస్తు ఎన్నికల జోష్ మొదలైంది. అధికార పార్టీలో ఆ జోరు ప్రగతి నివేదన సభ నుంచి మరీ ఎక్కువయ్యింది. తాజాగా జగిత్యాల జిల్లాలోని ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపి కవిత ప్రకటించారు.
జగిత్యాల నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపి కవిత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ...టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా జగిత్యాల నుండి సంజయ్ కుమార్ పోటీ చేస్తారని వెల్లడించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు,నియోజకవర్గ ప్రజలు అతడికి సహకరిస్తూ అండగా నిలవాలని కవిత సూచించారు.
ముందస్తు ఎన్నికలపై సెప్టెంబర్ లో క్లారిటీ వస్తుందని టీఆర్ఎస్ నేతలతో పాటు, ప్రతిపక్షాలు, తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. అందువల్ల సెప్టెంబర్ నుండే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటన ప్రారంభమవుతుందని ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా జగిత్యాల అభ్యర్థిని కవిత ప్రకటించడం సంచలనంగా మారింది.
ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. జీవన్ రెడ్డి మంత్రిగా పనిచేసిన కాలంలో తన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ది చేసుకోలేక పోయాడన్నారు. ఇలాంటి సూట్ కేసు దొంగల విమర్శలను టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం పట్టించుకోవడం ఎప్పుడో మానేసిందని తలసాని పేర్కొన్నారు.