సహకార సంఘ ఎన్నికలు.. టీఆర్ఎస్ నేత దారుణ హత్య

By telugu news teamFirst Published Feb 15, 2020, 9:52 AM IST
Highlights

సహకార ఎన్నికల విషయమై యార్కారం గ్రామంలో గత రెండు రోజులుగా కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలే వెంకన్నను హత్య చేసి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


సహకార సంఘ ఎన్నికల్లో భాగంగా ఓ టీఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. హత్యారాజకీయాలకు పెట్టింది పేరైన సూర్యాపేటలోనే ఈ దారుణం చోటుచేసుకోవడం గమనార్హం. సూర్యాపేట గ్రామీణ మండలం యార్కారం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామ మాజీ సర్పంచి, టీఆర్ఎస్ నేత ఒంటెద్దు వెంకన్నను ప్రత్యర్థులు శుక్రవారం అర్ధరాత్రి దారుణంగా హత్యచేశారు. 

సహకార సంఘ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లలో భాగంగా కార్యకర్తలతో మాట్లాడుతున్న వెంకన్నపై ప్రత్యర్థులు దాడిచేసినట్లు తెలుస్తోంది. కత్తులు, గొడ్డళ్లతో ఆయనను వెంబడించి మరీ ప్రాణాలు తీశారు.  ప్రాణభయంతో పరుగులు పెట్టిన వెంకన్న ఓ ఇంట్లోకి వెళ్లి దాక్కున్నా ఆయన ప్రాణం దక్కలేదు. నిందితులు తలుపులు పగులగొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. దీంతో యార్కారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

Also Read పెళ్లి చేయడం లేదని మనస్థాపం.. పురుగుల మందు తాగి...

సహకార ఎన్నికల విషయమై యార్కారం గ్రామంలో గత రెండు రోజులుగా కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలే వెంకన్నను హత్య చేసి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హత్య గురించి సమాచారం అందుకున్న డీఎస్పీ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

వెంకన్న హత్యతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. కాగా, వెంకన్న హత్యతో గ్రామంలో ఫ్యాక్షన్ హత్యలు మరోసారి మొదలయ్యాయి. పదిహేనేళ్ల కిందట ఇదే విధంగా గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు మిద్దె రవీందర్‌ను హత్య చేసినట్టు గ్రామస్థులు చెబుతున్నారు.

వెంకన్న హత్యపై కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు.

click me!