దెబ్బతిన్నా పోరాటం చేయడం తెలంగాణ నైజమని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ చెప్పారు.తన పాదయాత్రలో చిన్నపిల్లాడిని చూసిన తర్వాత తనకు అలా అన్పించిందన్నారు.
కామారెడ్డి:దెబ్బతిన్నా ఎదురొడ్డి పోరాటం చేయడం తెలంగాణ నైజమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు.కామారెడ్డి జిల్లాలోని మెనూరులో సోమవారంనాడు నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.భారత్ జోడో యాత్ర తెలంగాణలో ముగింపును పురస్కరించుకొని ఈ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది.కామారెడ్డి జిల్లా నుండి మహారాష్ట్రలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది.
తాను పాదయాత్ర చేసే సమయంలో గమనించిన విషయాన్ని రాహుల్ గాంధీ వివరించారు. ఓ చిన్న పిల్లవాడు తన పాదయాత్రలో పాల్గొనేందుకు ప్రయత్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. పోలీసులు నెట్టివేస్తున్నా, కిందపడినా పాదయాత్రలో పాల్గొన్నాడన్నారు.చివరకు తన పక్కనే వచ్చి ఆ పిల్లవాడు పాదయాత్ర నిర్వహించాడన్నారు. ఇదీ తెలంగాణవాసుల మనోధైర్యమని రాహుల్ గాంధీ చెప్పారు. .
తెలంగాణ ప్రజల కలలను టీఆర్ఎస్ సర్కార్ నాశనం చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తెలంగాణలో విద్య, వైద్య సౌకర్యాలు దయనీయ పరిస్థితిలో ఉన్నాయని ఆయన విమర్శించాయి.విద్య వ్యవస్థనునాశనం చేశారన్నారు. పేదల భూములపై టీఆర్ఎస్ సర్కార్ పెత్తనం చేస్తుందన్నారు.భూములపై హక్కులను కాలరాస్తుందన్నారు. తాముఅధికారంలోకి వస్తే ఈ పరిస్థితిని మార్చేస్తామని ఆయన చెప్పారు.తనను కలిసిన ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని రాహుల్ గాంధీ చెప్పారు
తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ చెప్పారు. దెబ్బలు తగులుతున్నా భయపడకుండా పనిచేస్తున్నారన్నారు. తెలంగాణలో కార్యకర్తలు ఎలా పనిచేస్తున్నారో తాను స్వయంగా చూసినట్టుగా ఆయన చెప్పారు. తెలంగాణలో తాను చాలా మందితో మాట్లాడానని ఆయన చెప్పారు. కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నందుకు తాను మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.ఇవాళ్టితో తన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ముగిసిందన్నారు.తెలంగాణ అంటే ఏమిటో ఈ పర్యటనతో అర్ధమైందని రాహుల్ గాంధీ చెప్పారు.పాదయాత్రలో తాను చాలా విషయాలు గమనించినట్టుగా తెలిపారు.