నాయినికి కేసీఆర్ బుజ్జగింపులు:మరికాసేపట్లో రెండు స్థానాల అభ్యర్థుల ప్రకటన

By Nagaraju TFirst Published Nov 17, 2018, 12:16 PM IST
Highlights

 టీఆర్ఎస్ పార్టీలో పెండింగ్ లో ఉన్న కోదాడ, ముషీరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు గులాబీ బాస్ కేసీఆర్ రెడీ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆలస్యం చెయ్యకుండా ఉండేందుకు రంగం సిద్ధం చేశారు. మరికాసేపట్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీలో పెండింగ్ లో ఉన్న కోదాడ, ముషీరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు గులాబీ బాస్ కేసీఆర్ రెడీ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆలస్యం చెయ్యకుండా ఉండేందుకు రంగం సిద్ధం చేశారు. మరికాసేపట్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

కోదాడ, ముషీరాబాద్ నియోజకవర్గాల అభ్యర్థులను దాదాపుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కోదాడ నియోజకవర్గం అభ్యర్థిగా శశిధర్ రెడ్డి లేదా బొల్లం మల్లయ్య యాదవ్‌ పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఇటీవలే బొల్లం మల్లయ్య యాదవ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 

ఇకపోతే ముషీరాబాద్ నియోజకవర్గం ముఠాగోపాల్ కి ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని బుజ్జగించేందుకు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా తన క్యాంప్ ఆఫీసుకు రావాలని నాయినిని ఆదేశించారు. 

ఇప్పటికే ముషీరాబాద్ టిక్కెట్ ను నాయిని నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు. తన అల్లుడు కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వాలని నాయిని పట్టుబడుతున్నారు. అయితే కార్పొరేటర్లకు సీట్లు ఇస్తే పార్టీలో మరో ముగ్గురికి ఇవ్వాల్సి వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. 

ఇప్పటికే మేయర్ బొంతు రామ్మోహన్ ఉప్పల్ నియోజకవర్గం ఆశిస్తుండగా పీజేఆర్ తనయ విజయారెడ్డి ఖైరతాబాద్, ఇక టీఆర్ ఎస్ జనరల్ సెక్రటరీ కేకే కుమార్తె విజయలక్ష్మీ కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. ఒకరికి ఇస్తే మెుత్తం నలుగురికి ఇవ్వాల్సి వస్తుందన్న ఆలోచనల నేపథ్యంలో కేసీఆర్ శ్రీనివాస్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. 

ఒకవేళ కార్పొరేటర్ కు ఇవ్వకూడదని నిర్ణయించుకున్న నేపథ్యంలో తనకు అయినా ఇవ్వాలని నాయిని నర్సింహారెడ్డి గత కొంతకాలంగా కేసీఆర్ పై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గానికి ముఠాగోపాల్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 

ఇదే విషయాన్ని నాయినితో చెప్పి ముఠాగోపాల్ గెలుపుకు సహకరించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. నాయినితో భేటీ అనంతరం రెండు నియోజకవర్గాల అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించనున్నారు. 

click me!