TRS: పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్‌ఎస్.. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందంటూ ఫైర్..

By Sumanth KFirst Published Dec 7, 2021, 12:47 PM IST
Highlights

ధాన్యం సేకరణపై (paddy procurement) కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. ఈ మేరకు ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు (K Keshava Rao) ప్రకటన చేశారు.

ధాన్యం సేకరణపై (paddy procurement) కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు.అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఎంపీ కే కేశవరావు మాట్లాడుతూ.. వారం రోజులుగా పార్లమెంట్ వేదికగా ఆందోళన చేస్తున్నామని చెప్పారు. తమ ఆందోళనలను కేంద్రం పట్టించుకోకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. కేంద్రం తీరుకు నిరసనగా బాయికాట్ చేస్తున్నామని ప్రకటించారు. సమావేశాలను బాయ్‌కట్ చేయాలని ఎవరూ కోరుకోరని అన్నారు. లోక్‌సభలో 9 మంది, రాజ్యసభలో 7 మంది సభ్యులు సమావేశాలను బాయ్‌కట్ చేస్తున్నట్టుగా చెప్పారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎఫ్‌సీఐ నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. 

తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనబోమని చెబుతున్నారు. రబీలో పూర్తిగా ఉప్పుడు బియ్యం మాత్రమే వస్తుందని.. వాతావరణ పరిస్థితుల వల్ల రా రైస్ రాదని తెలిపారు. రబీ ధాన్యం సేకరణలో కేంద్రం వివక్ష చూపడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. త్వరలోనే తదుపరి కార్యచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. 

ఇక, పార్లమెంటు శీతాకాల సమావేశాలు (Parliament Winter session) ప్రారంభమైన తొలి రోజు నుంచే ధాన్యం సేకరణపై  కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ఎంపీలు (TRS MPs) ఉభయ సభల్లో నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు నల్ల చొక్కాలు ధరించిన టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలలో నిరసన తెలియజేశారు. లోక్‌స‌భ‌లో స్పీక‌ర్ పోడియం వ‌ద్ద టీఆర్ఎస్ ఎంపీలు ప్ల‌కార్డుల‌తో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. కేంద్రం తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తుందని నినాదాలు చేశారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై జాతీయ విధానం ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు.

అనంతరం లోక్‌సభ, రాజ్యసభ నుంచి టీఆర్‌ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. అనంతరం టీఆర్‌ఎస్.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీ కే కేశవరావు (K Keshava Rao) ప్రకటించారు. డిసెంబర్ 23 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాలకు తమ ఎంపీలు హాజరు కాబోరని చెప్పారు. తెలంగాణ నుంచి వరి కొనుగోళ్లు చేపట్టాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.  ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మండిపడ్డారు. రైతులను కాపాడాలని పార్లమెంట్ ఆవరణలో టీఆర్‌ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. రైతులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Also Read: TRS MPs walk out: పార్లమెంట్ ఉభయ సభల నుంచి టీఆర్‌ఎస్ ఎంపీల వాకౌట్..

ఇక, వరి కొనుగోళ్లకు సంబంధించి గత కొంతకాలంగా తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాల మధ్య మాటల యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై పోరుకు సిద్దమయ్యారు. ఇందిరా పార్క్‌లో టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహిచిన ధర్నాలో కూడా కేసీఆర్ పాల్గొన్నారు. అంతేకాకుండా ప్రెస్‌మీట్లలో కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా ఈ అంశంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యుహాలపై టీఆర్‌ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కలిసివచ్చే పార్టీలతో కలిసి పోరాడాలని సూచించారు.

 ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్ లోపల, వెలుపల నిరసన గళం వినిపిస్తున్నారు. సమగ్ర జాతీయ ధాన్య సేకరణ విధానం తీసుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంఎస్‌పీ అమలుపై చర్చకు పట్టుబడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్‌లో చేసిన ప్రకటనపై టీఆర్‌ఎస్ ఎంపీలు సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలోనే కేంద్రం వైఖరికి నిరసనగా భవిష్యత్తు కార్యచరణ, కార్యక్రమాలను ప్లాన్ చేసేందుకు సీఎం కేసీఆర్ .. టీఆర్‌ఎస్ ఎంపీలను హైదరాబాద్‌కు తిరిగి రమ్మని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. 

click me!