
Minister KTR: సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ ను ప్రస్తుతం విద్యుత్ కొరత వేధిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి బీజేపీ సర్కారు రాష్ట్రంలో పవర్ హాలీడే ప్రకటించింది. రైతులకు సరిపడా విద్యుత్తును అందించలేని పరిస్థితులు ఉన్న క్రమంలో ప్రభత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వారంలో ఒక రోజు రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు తప్పకుండా సెలవు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే స్పందించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి, TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR.. బీజేపీపై సెటైర్లు వేశారు. బీజేపీ నేతలు చెప్పిన డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఇదేనా.. డబుల్ ఇంజిన్ కాదు ట్రబుల్ ఇంజిన్ అని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కేటీఆర్ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
కాగా, గుజరాత్ ప్రస్తుతం విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నది. అక్కడి రైతులకు ఎనిమిది గంటల విద్యుత్ ను అందిస్తామని ఇది వరకు రాష్ట్ర బీజేపీ సర్కారు ప్రకటించింది కానీ.. కరెంట్ కొతలు విధిస్తూ.. మూడు నాలుగు గంటలే రైతులకు విద్యుత్ ను అందిస్తున్నారని అక్కడి ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో వారంలో ఒక రోజు పరిశ్రమలకు పవర్ హాలిడే ఉంటుందని గుజరాత్ సర్కార్ ప్రకటించింది. వారానికో రోజు పరిశ్రమలన్నీ కచ్చితంగా సెలవులు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతులకు సరిపడా విద్యుత్ సరఫరా లేని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు గుజరాత్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అన్ని జిల్లాలకూ పవర్ హాలిడే ఒకే రోజు వుండదని పేర్కొన్న గుజరాత్ సర్కారు.. ఒక్కో జిల్లాకు ఒక్కో రోజు పవర్ హాలీడే వుంటుందని స్పష్టం చేసింది. ఇక ప్రధాని నరేంద్రమోడీ స్వరాష్ట్రం.. బీజేపీ నేతలు పదేపదే చెప్పె గుజరాత్ మోడల్ లో పవర్ హాలీడే ప్రకటించడంతో బీజేపై సెటైర్లు వెస్తున్నారు.
ఇదిలావుండగా, రాష్ట్రంలో దూకుడుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ లకు అడ్డుకట్ట వేసే విధంగా అధికార పార్టీ నేతలు, మంత్రులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా రాజకీయంగా వివాదం లేపుతున్న ధాన్యం కొనుగోలు అంశంపై బీజేపీ, కాంగ్రెస్ పై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ స్పష్టంగా తప్పుడు సమాచారం అందిస్తున్నారనీ, వాస్తవ పరిస్థితులపై తప్పుదారి పట్టించాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ-ప్రతిపక్ష కాంగ్రెస్ లపై విమర్శలు గుప్పించారు. అంతకు ముందు ధాన్యం కొనుగోలు అంశాన్ని టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. దశాబ్దాలుగా దేశంలోని రైతులను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ ముందుగా వారికి క్షమాపణ చెప్పాలని ఆయన వరుస ట్వీట్లలో డిమాండ్ చేశారు. పదే పదే తెలంగాణ నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు నిరాకరించిన ఢిల్లీలో అధికారంలో ఉన్న వారిపై తన విమర్శలను మళ్లించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూచించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలతో టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరును పోల్చడం సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు.