
ట్రాన్స్ జెండర్స్‌కు పత్యేక వైద్య సేవలు అందించే దిశగా కీలక ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌ను ప్రారంభించింది. బుధవారం రోజు నుంచి ఈ క్లినిక్ అందుబాటులోకి వచ్చింది. సెన్సిటైజేషన్ శిక్షణ పొందిన వైద్య నిపుణులతో కూడిన సిబ్బంది.. ట్రాన్స్‌జెండర్లకు అనేక రకాల వైద్య చికిత్సలను ఇక్కడ అందించనున్నారు. ప్రస్తుతం ఈ క్లినిక్ వారానికి ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రతి బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేస్తుంది. క్లినిక్‌ను సందర్శించే వారి సంఖ్యను ప్రకారం రాబోయే రోజుల సంఖ్యను పెంచాలని యోచిస్తున్నారు.
అయితే ఉస్మానియా ఆస్పత్రిలో తమ కోసం ప్రత్యేక క్లినిక్‌ను ఏర్పాటు చేయడంపై ట్రాన్స్ జెండర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ క్లినిక్‌లో ఇద్దరు ఎండోక్రినాలజిస్టులు డాక్టర్ రాకేష్ సహాయ్, డాక్టర్ నీలవేణిలు.. లింగమార్పిడి వ్యక్తులకు హార్మోన్ల చికిత్స, ఇతర అవసరమైన చికిత్సలను అందించనున్నారు. గైనకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, సైకియాట్రీ, యూరాలజీ, ఇతర విభాగాలు కూడా అవసరమైనప్పుడు సహాయం చేస్తాయి. ఈ సమర్థులైన వైద్యుల బృందంతో పాటు.. ప్రభుత్వ సేవలో చేరిన తెలంగాణ తొలి లింగమార్పిడి వైద్యులు డాక్టర్ ప్రాచీ రాథోడ్, డాక్టర్ రూత్ జాన్ పాల్‌లు కూడా సమన్వయకర్తలుగా నియమితులయ్యారు.
“లింగమార్పిడి వ్యక్తులు ఆరోగ్య సంరక్షణ సేవలను పొందడం చాలా కష్టం. ఆలస్యమైనప్పటికీ.. ఈ రోజు మేము ఎటువంటి వివక్ష లేకుండా ఉచితంగా చికిత్స అందించే క్లినిక్‌ని కలిగి ఉన్నాము’’ అని డాక్టర్ ప్రాచి చెప్పారు. ఇక, జెండర్ డిస్ఫోరియాను గుర్తించడ, జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ సర్టిఫికేట్‌లను జారీ చేయడానికి వైద్య పరీక్షలు కూడా ఇక్కడ ప్రాథమిక దృష్టిగా ఉండనున్నాయి.