కట్టుకున్న భర్తతో పాటు అత్తింటివారి వేధింపులు భరించలేక నవవధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాాబాద్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ : అత్తింటివారి వేధింపులు భరించలేక నవవధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది. ఏ కష్టం రాకుండా చూసుకుంటాడని నమ్మిన కట్టుకున్నవాడు, కన్నబిడ్డలా చూసుకుంటారని అనుకున్న అత్తామామలే అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధించడాన్ని ఆమె భరించలేకపోయింది. పుట్టింటివారిని బాధపెట్టలేక, అత్తింటివారి వేధింపులు భరించలేక తీవ్ర ఒత్తిడికి గురయిన యువతి పెళ్లయిన ఆర్నెళ్లకే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది.
హైదరాబాద్ లోని కాటేదాన్ నేతాజీనగర్ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ కు కవితతో ఆరునెలల క్రితమే వివాహం జరిగింది. అత్తవారింట్లో అడుగుపెట్టిన నాటినుండి కవితకు వేధింపులు, అవమానాలే ఎదురయ్యాయి. భర్తతో పాటు అత్తామామలు అదనపు కట్నం కోసం, ఆడపడుచు సూటిపోటి మాటలతో వేధించడం కవిత భరించలేకపోయింది.ఇలా అత్తవారింట్లో మానసికంగానే కాదు శారీరకంగా కూడా చిత్రహింసలకు గురయిన నవవధువు దారుణ నిర్ణయం తీసుకుంది.
Read More వేరు కాపురం పెడదామంటూ భార్య వేధింపులు... మనస్తాపంతో భర్త సూసైడ్
అత్తవారింట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకుని కవిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సూసైడ్ పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కవిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భర్త చంద్రశేఖర్ తో పాటు అతడి తల్లిదండ్రులు, సోదరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.తమ బిడ్డ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)