సూర్యాపేటలో విషాదం.. కారు కింద నలిగి 18నెలల చిన్నారి మృతి.. వెనక్కి తీస్తుండగా ప్రమాదం..

By Bukka SumabalaFirst Published Aug 19, 2022, 6:31 AM IST
Highlights

సూర్యాపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు రివర్స్ తీస్తుండగా చక్రం కింద నలిగి ఓ 18 నెలల చిన్నారి మృతి చెందింది. 

సూర్యాపేట : కారు చక్రం కింద ఓ చిన్నారి నలిగిపోయింది. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన సంక్రాంతి విజయ్ శేఖర్, శిరీష దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కాగా, విజయ్ శేఖర్ ఇంటికి మధ్యాహ్నం బంధువులు కారులో వచ్చారు. వారు ఇంట్లోకి వెళ్ళగానే డ్రైవర్ ఎదురుగా ఉన్న చెట్టు కింద కారును రివర్స్ లో పార్కు చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత పని నిమిత్తం శిరీష ఎదురింట్లోకి వెళ్లగా.. తల్లిని చిన్నకూతురు 18 నెలల షణ్ముఖ కూడా అనుసరించింది.

 ఆ ఇంటి ఎదురుగానే నిలిపిన కారు వెనుక డోరు పక్కన షణ్ముఖ ఆడుకుంటుంది. షణ్ముఖను గమనించని తల్లి శిరీష ఒక్కతే ఇంట్లోకి వెళ్లిపోయింది. ఇంతలోనే కారు డ్రైవర్ అక్కడికి వచ్చి చిన్నారిని గమనించకుండా వాహనాన్ని ముందుకు కదిలించాడు. అయితే, ఆ సమయంలో వెనుక చక్రం వద్ద ఆడుకుంటున్న షణ్ముఖ దాని కింద పడిపోయింది. దీంతో టైరు బాలిక తలపైనుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. షణ్ముఖ కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి వచ్చి.. కోదాడ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే మృతి చెందింది. అప్పటివరకు సందడిగా ఆడుకుంటున్న చిన్నారిని అంతలోనే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. 

ఎర్రవాళ్లైనా, పచ్చవాళ్లైనా .. ఎవరినైనా తెచ్చుకో, బీజేపీతో బలప్రదర్శనకు సిద్ధమా : కేసీఆర్ బండి సంజయ్ సవాల్

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే గతంలో హైదరాబాద్ లో జరిగింది. :తండ్రి నడుపుతున్న కారు కింద పడి పద్దెనిమిది నెలల చిన్నారి మృత్యువాత పడింది. ఈ సంఘటన 2020 ఫిబ్రవరిలో చోటు చేసుకుంది. చంద్రాయణగుట్ట పోలీసుల కథనం ప్రకారం.... తెల్లవారు జామున 3.45 గంటల సమయంలో 28 ఏళ్ల డ్రైవర్ ఖలీద్ సారీ తన కారును బయటకు తీయాలని బైటికి వచ్చాడు. అతని వెనుకే అతని 18 నెలల కూతురు వచ్చింది. అది అతను గమనించలేదు. ఆమె కారు ముందు ఉంది.. అది చూడకుండా కారును ఖలీద్ ముందుకు తోలడంతో ఆమె మరణించింది.

పాప ఏడుపు వినిపించేసరికి షాక్ అయిన ఖలీద్ వెంటనే కారు దిగి చూసేసరికి తీవ్ర గాయాలతో పాప ఉంది. వెంటనే పాపను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకని వెళ్లారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు  గస్తీ తిరుుగుతున్న పోలీసులకు స్థానికుల నుంచి సమాచారం అందింది. దాంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. పాప తన కారు ముందు నించున్న విషయాన్ని ఖలీద్ గుర్తించలేదని, దాంతో కారును ముందుకు తోలడంతో పాప కారు ముందు చక్రాల కిందికి వచ్చిందని, ఆమె తలకు తీవ్రమైన గాయాలయ్యాయని చెబుతున్నారు.

click me!