శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడ.. ఎలా.. అంటే..

By SumaBala BukkaFirst Published Mar 29, 2023, 6:06 PM IST
Highlights

శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో గురువారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ఆ వివరాలు తెలిపారు పోలీసులు. 
 

హైదరాబాద్ : గురువారం మార్చి 30వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ శోభాయాత్ర  జరుగుతుంది కాబట్టి  నగరంలోని పలు జంక్షన్ లలో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య ఎలాంటి విధమైన ట్రాఫిక్ ఇబ్బందులు నగరంలో తలెత్తకుండా ఉండేందుకు నగర ట్రాఫిక్ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రయాణికులు, పట్టణ ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని పోలీసులు సూచించారు.

గురువారం ఉదయం  9:30 గంటలకు భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటకు శోభయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ఊరేగింపు సీతారాం బాగ్ లోని రాముడి ఆలయం నుంచి రామకోటిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు వెళుతుంది. లక్ష మందికిపైగా భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. దీంతో నగరంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. 

డేటా లీక్ కేసులో ముగిసిన రెండో రోజు విచారణ : కాల్ సెంటర్లు, బ్యాంక్ సిబ్బంది పాత్రపై అనుమానాలు.. నోటీసులు

దీని ప్రకారం గురువారం ఉదయం 9 గంటల నుండి.. ప్రధాన ఊరేగింపు సీతారాంబాగ్ ఆలయం నుండి రామకోటిలోని హనుమాన్ వ్యాయామశాల స్కూలు వరకు.. బోయిగూడా కమాన్, జాలి హనుమాన్, మంగళహాట్ పిఎస్ రోడ్, పురానా పూల్, గాంధీ విగ్రహం, దూల్పేట్, చుడిబజార్ బేగంబజార్, జుమ్మేరాత్ బజార్, బేగం బజార్ చత్రి, బర్తన్ బజార్, శంకర్ షేర్ హోటల్, గురుద్వారా, సిద్ధి అంబర్ బజార్, గౌలిగూడ చమన్, పుత్లిబౌలి ఎక్స్ రోడ్స్, సుల్తాన్ బజార్, కోఠీల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో చిన్న చిన్న ఊరేగింపులు వివిధ పాయింట్లు దగ్గర ప్రధాన ఊరేగింపుతో కలుస్తాయి.

కాగా ఊరేగింపు ఈ ప్రాంతాల గుండా వెళుతున్న సమయంలో ఆయా ప్రదేశాలలో అవాంఛనీయ సంఘటనలు, అంతరాయాలు కలగకుండా ట్రాఫిక్ ను మళ్లిస్తారు. ఇది దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించడానికి  సిద్ధంగా ఉండాలని..  ఈ మేరకు తమ కోరుకున్న గమ్యస్థానాలకి చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
 

click me!