డేటా లీక్ కేసులో ముగిసిన రెండో రోజు విచారణ : కాల్ సెంటర్లు, బ్యాంక్ సిబ్బంది పాత్రపై అనుమానాలు.. నోటీసులు
సైబరాబాద్ పోలీసులు వెలుగులోకి తెచ్చిన డేటా చోరీ కేసుకు సంబంధించి రెండో రోజు విచారణ ముగిసింది. జస్ట్ డయల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల నుంచి డేటా చోరీ అయినట్లుగా గుర్తించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసుకు సంబంధించి రెండో రోజు విచారణ ముగిసింది. 9 మంది నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు. డేటా చోరీలో బ్యాంక్, కాల్ సెంటర్లలోని ఉన్నత స్థాయి ఉద్యోగుల పాత్ర వున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విలువైన డేటా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లినట్లుగా గుర్తించారు. ఆఫీసులకు ముందుగా వచ్చి పెన్‌డ్రైవ్‌లోకి డేటా బదిలీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
ముంబై, హైదరాబాద్, ఢిల్లీకి చెందిన ఉద్యోగులే సూత్రధారులని సమాచారం. జస్ట్ డయల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల నుంచి డేటా చోరీ అయినట్లుగా గుర్తించారు. దీంతో బ్యాంక్‌లతో పాటు జస్ట్ డయల్‌కి నోటీసులు ఇచ్చారు పోలీసులు. అలాగే మరోసారి సైబరాబాద్ పోలీసులత భేటీ అయ్యాయి కేంద్ర వర్గాలు. డిఫెన్స్, నేవీ, ఆర్మీ ఆఫీసర్ల డేటా లీక్‌పై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. విదేశాలకు డేటా ఏమైనా లీక్ చేశారా అనే కోణంలోనూ విచారిస్తున్నారు. డేటా లీక్‌లో రెహ్మాన్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించాడు.
కాగా.. వ్యక్తుల వ్యక్తిగత డేటాను అక్రమంగా యాక్సెస్ చేసి విక్రయిస్తున్న ఏడుగురు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 'నిందితులు సేకరించి, భద్రపరిచిన మొత్తం డేటాను సురక్షితంగా ఉంచడంతో పాటు ఎలాంటి మార్పులు చేయకుండా చూడాలని గూగుల్ కు లేఖ రాశాం. క్లౌడ్ లోని డేటాను ఫోరెన్సిక్ విశ్లేషించిన తర్వాతే ఎంత సమాచారం చోరీకి గురైందో తెలుస్తుంది..' అని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు.
వ్యక్తిగత డేటా చోరీకి పాల్పడ్డ మొత్తం 12 మందిని అరెస్టు చేశామని, నలుగురికి నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు. అలాగే, నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, ఇతర కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితులు కుమార్ నితీశ్ భూషణ్, కుమారి పూజా పాల్, సుశీల్ థోమర్, అతుల్ ప్రతాప్ సింగ్, ముస్కాన్ హసన్, సందీప్ పాల్, జియా యువర్ రెహ్మాన్ ను క్లౌడ్ తో పాటు హార్డ్ డిస్క్ లలో డేటాను నిక్షిప్తం చేశారని పోలీసులు తెలిపారు.
నీట్ పరీక్షకు అర్హులైన విద్యార్థులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు, బ్యాంకు కస్టమర్లు, పాన్ కార్డు వినియోగదారులు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ సిబ్బంది, వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఇలా వివిధ కేటగిరీల్లో డేటాను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ డేటా పరిమాణం చాలా పెద్దదని చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించి కొనుగోలుదారులను గుర్తించేందుకు పోలీసులు వేచి చూస్తున్నారు. ఈ ఉల్లంఘనలకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు వివిధ ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేసే పనిలో ఉన్నారు.