నిజాం ఆస్తుల స్వాధీనం: ఏడేళ్లు అధికారంలో వుండి ఏం చేశారు.. బీజేపీపై మహేశ్ గౌడ్ ఆరోపణలు

By Siva KodatiFirst Published Aug 31, 2021, 4:20 PM IST
Highlights

రాజుల భూములు, ఆస్తులను పేదలకు పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని టీపీసీసీ  చీఫ్ మహేశ్ గౌడ్ గుర్తుచేశారు. ఏడేళ్లుగా బీజేపీ అధికారంలో వుండి.. నిజాం ఆస్తులను ఎందుకు జప్తు చేయలేదని ఆయన బండి సంజయ్‌ని ప్రశ్నించారు.

బీజేపీ, బండి సంజయ్‌లపై విరుచుకుపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్. నిజాం ఆస్తులపై బీజేపీవి తలా తోకా లేని మాటలు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. రాజుల భూములు, ఆస్తులను పేదలకు పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మహేశ్ గౌడ్ గుర్తుచేశారు. ఏడేళ్లుగా బీజేపీ అధికారంలో వుండి.. నిజాం ఆస్తులను ఎందుకు జప్తు చేయలేదని ఆయన ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరదల్లో బండి పోతే బండి, ఇల్లు పోతే ఇల్లు ఇస్తానన్న బండి సంజయ్ ఎందుకు ఇప్పించలేదని మహేశ్ గౌగ్ ప్రశ్నించారు. ధరలు పెంచి ప్రజలపై బీజేపీ సంగ్రామం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. 

కాగా, బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం ఆస్తులు, భూములను స్వా ధీనం చేసుకుంటాం’అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. పరాధీనంలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిని తిరిగి ప్రజలకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర మూడోరోజైన సోమవారం సాయంత్రం ఆరెమైసమ్మ ఆలయం వద్ద నిర్వహించిన సభలో ప్రజలనుద్దేశించి బండి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భాగ్యలక్ష్మీ అమ్మ వారి సాక్షిగా ఎంఐఎం అడ్డాను బద్దలు కొట్టిన సత్తా బీజేపీ కార్యకర్తలదేనన్నారు. పాతబస్తీనే కాదు.. వాళ్లు సవాల్‌ చేస్తే ఏ బస్తీకైనా వచ్చి కాషాయ జెండా ఎగరేస్తామంటూ సంజయ్ అన్నారు. 
 

click me!