
బీజేపీ, టీఆర్ఎస్‌లపై విమర్శలు గుప్పించారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, తెలంగాణ సభల్లో ఒక్కరు కూడా ప్రజల సమస్యలపై మాట్లాడలేదని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ ద్వారా ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారని మల్లు రవి ఆరోపించారు. మునుగోడులో గెలిస్తే ఏం చేస్తామనే విషయాన్ని కేసీఆర్, అమిత్ షాలలో ఒక్కరూ కూడా చెప్పలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడానికి సభలు పెట్టారంటూ మల్లు రవి దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదనేదే ఈ రెండు పార్టీల లక్ష్యమని ఆయన ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై ప్రధాని మోడీ, అమిత్ షాలు మాట్లాడుతున్నారని.. మరి కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని మల్లు రవి ప్రశ్నించారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు ఓటువేస్తే బీజేపీకి వేసినట్లేనని మల్లు రవి ఆరోపించారు.
ఇకపోతే .. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్‌గా ఉన్న దామోదర్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్‌లో తన పదవితో పాటు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడినా ఫలితం ఉండడం లేదని, తమ కష్టాన్ని పార్టీ నేతలు గుర్తించడం లేదని పేర్కొన్నారు. మరోవైపు భవిష్యత్తు నిర్ణయాన్ని కూడా దామోదర్ రెడ్డి ప్రకటించారు. తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు
ఇదిలా ఉంటే.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ దామోదర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి మహేష్ కుమార్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ప్రస్తుత పరిణామాలు పరిశీలిస్తే తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రభావం కనిపిస్తోంది. ఇటీవలే దాసోజ్ శ్రవణ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిపిందే. ఇటీవల టీఆర్ఎస్ రాజీనామా చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.