ఆ ర్యాలీకి ‘చే’యిందిస్తే మనకేంటీ...?

Published : Feb 16, 2017, 02:08 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
ఆ ర్యాలీకి ‘చే’యిందిస్తే మనకేంటీ...?

సారాంశం

నిరుద్యోగ  నిరసన ర్యాలీ సక్సెస్ అయితే  ఆ క్రెడిట్ జేఏసీకే  వెళుతుందని  కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు.  అందుకే ర్యాలీకి మద్దతుపై  ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

తెలంగాణలో లక్ష ఉద్యోగాల హామీపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, ఉద్యోగనియామకాలు చేపట్టేలా ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ రాజకీయ జేఏసీ  ఈ నెల 22 న హైదరాబాద్ లో నిరుద్యోగ ర్యాలీ నిర్వహణకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

 

ఈ ర్యాలీలో యువత పాల్గొనాలని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. యూనివర్సిటీలకు వెళ్లి అభ్యర్థులను కదిలిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు సైతం పిలుపునిస్తున్నారు.

 

వామపక్షాలు అలాగే టీడీపీ కూడా టీ జేఏసీ తలపెట్టిన ర్యాలీకి తమ శ్రేణులతో కదలివచ్చేందుకు సిద్ధంగానే ఉన్నాయి.

 

అయితే తెలంగాణ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ మాత్రం ర్యాలీలో పాల్గొనే విషయంపై ఇప్పటి వరకు ఎటూ తేల్చుకోలేక పోతోంది.

 

జేఏసీ ర్యాలీకి మద్దతిస్తే తమ పార్టీకి ఒరిగేదేముంది అనేది ఆ పార్టీ నేతల్లో కొందరి ప్రధాన ప్రశ్న.  ఇప్పటికే తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ పార్టీకి దక్కకుండా పోయింది. రెండున్నరేళ్ల టీఆర్ఎస్ పాలన వైఫల్యాపై పార్టీ నేతలందరూ గొంతు చించుకొని అరుస్తున్నా ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదని పార్టీ సీనియర్ నేతలే భావిస్తున్నారు.

 

కాగా, జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తమ కంటే జేఏసీ నేతల మాటలనే ప్రజలు ఎక్కువగా విశ్వసిస్తున్నారు అని మరికొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.

 

మరోవైపు టీ జేఏసీ త్వరలో రాజకీయ పార్టీగా అవతరించే అవకాశం ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో టీ జేఏసీ ర్యాలీకి మద్దతివ్వడం సరికాదననే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

 

నిరుద్యోగ నిరసన ర్యాలీ మంచి కార్యక్రమమే అని కాంగ్రెస్ నేతలు ఒప్పుకుంటున్నా..ఆ ర్యాలీ జేఏసీ నేతల ఆధ్వర్యంలో జరగడం, అది సక్సెస్ అయితే క్రెడిట్ జేఏసీకే  వెళుతుందని వారు భయపడుతున్నారు.  అందుకే ర్యాలీకి మద్దతుపై  ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

PREV
click me!

Recommended Stories

Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా
Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!