Munugode bypoll 2022: రేపు మునుగోడుకు రేవంత్ రెడ్డి, 22 నుండి మండలాల వారీగా సమీక్ష

By narsimha lodeFirst Published Aug 19, 2022, 11:19 AM IST
Highlights

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ నెల 20వ తేదీన మునుగోడుకు వెళ్లనున్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల విషయమై పార్టీ నేతలతో ఆయన చర్చించనున్నారు. 

నల్గొండ: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ఈ నెల 20వ తేదీన మునుగోడుకు వెళ్లనున్నారు.  మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల విఁషయమై  పార్టీ నేతలతో చర్చించనున్నారు.గ్రామాల వారీగా కాంగ్రెస్ సహా ఇతర పార్టీల బల బలాలపై  పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు.రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ నియోజకవర్గంలోని 170 గ్రామాల్లో  రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు కాంగ్రెస్ పార్టీ మండలాల వారీగా ఇంచార్జీలను నియమించింది.ఒక్కో మండలానికి ఇద్దరు చొప్పున ఇంచార్జీల నియామకం జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ఈ నెల 8వ తేదీన రాజీనామా చేశారు.ఈ రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. దీంతో ఆరు మాసాల్లోపుగా ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.  దీంతో ఈ స్థానంలో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ తమ శక్తియుక్తులన్నీ ధారపోస్తున్నాయి.  మన మునుగోడు మన కాంగ్రెస్ నినాదంతో  కాంగ్రెస్ పార్టీ  ఈ ఎన్నికల్లో ప్రచారం చేయనుంది.  ఈ మేరకు ఈ  పోస్టర్ ను రేవంత్ రెడ్డి ఇవాళ విడుదల చేశారు. ఈ నెల 22 నుండి మండలాల వారీగా పార్టీ పరిస్థితిపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. 

also read:మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారానికి సిద్దం, కానీ ఇలా చేయాలి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి చాన్స్ దక్కే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ స్థానంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని బరిలోకి దింపాలని భావిస్తున్నారని సమాచారం. బీజేపీ, టీఆర్ఎస్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధులను బరిలోకి దింపితే బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధరిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తుంది.ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ ఓటు బ్యాంకును తమ వైపునకు తిప్పుకొనేందుకు బీసీ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తే ఆశాజనకమైన పలితాలు వస్తాయనే విషయమై కూడా కాంగ్రెస్ పార్టీ సర్వేలు నిర్వహించింది.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ లేదా సీపీఐ అభ్యర్ధులు ఎక్కువ దఫాలు విజయం సాధించారు. దీంతో ఈ స్థానంలో తన పట్టును నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ స్థానంలో విజయం సాధించడం ద్వారా పార్టీని వీడిన రాజగోపాల్ రెడ్డికి  రాజకీయంగా బుద్ది చెప్పాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అదే  జరిగితే టీఆర్ఎస్ , బీజేపీకి కూడా చెక్ పెట్టినట్టు అవుతుందని కాంగ్రెస్  భావిస్తుంది.మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోనే రేవంత్ రెడ్డి మకాం వేయనున్నారు. తొలి విడతలో 15 రోజుల పాటు  రేవంత్ రెడ్డి పర్యటనలో పాల్గొంటారు.
 

click me!