చెరకు ఫ్యాక్టరీలు నడిపించలేని సీఎం.. రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారు: కేసీఆర్‌పై రేవంత్‌ ఆగ్రహం

By Siva KodatiFirst Published Sep 24, 2021, 7:03 PM IST
Highlights

చెరకు ఫ్యాక్టరీలు నడిపించలేని సీఎం.. రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ  చీఫ్ రేవంత్‌ మండిపడ్డారు.  తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలుపుతున్న జహీరాబాద్‌ చెరకు రైతులను శుక్రవారం కలిసిన ఆయన సంఘీభావం తెలిపారు. 

ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా చెరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలుపుతున్న జహీరాబాద్‌ చెరకు రైతులను శుక్రవారం కలిసిన ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ... ఆలయాలకు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని.. రైతులకు రివాల్వింగ్‌ ఫండ్‌ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. చెరకును ప్రభుత్వమే కర్ణాటక మిల్లులకు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు.

మద్దతు ధర కల్పిస్తే రైతుబంధు, బీమా, రుణమాఫీ అవసరం ఉండదని రేవంత్ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో చెరకు రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. చెరకు ఫ్యాక్టరీలు నడిపించలేని సీఎం.. రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారని రేవంత్‌ దుయ్యబట్టారు. కాగా, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో చెరకు రైతులు బంద్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రైతులు భారీ ర్యాలీ చేపట్టి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

జహీరాబాద్‌ ప్రాంతంలో దాదాపు 20 వేల ఎకరాల్లో 10 లక్షల మెట్రిక్‌ టన్నుల చెరకు సాగు చేస్తున్నారు. అయితే, జహీరాబాద్‌ సమీపంలోని చక్కెర పరిశ్రమలో రెండేళ్లుగా పనులు సాగించడం లేదు. దీంతో స్థానిక చెరుకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలోనే రైతులు భారీ ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.  
 

click me!