టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో విచారణ ముందుకు సాగాలంటే మంత్రి కేటీఆర్ కేబినెట్‌లో వుండకూడదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీఎస్‌పీఎస్సీ తీగ లాగితే.. ప్రగతి భవన్ లింక్ బయటపడిందన్నారు.
టీఎస్‌పీఎస్సీ తీగ లాగితే.. ప్రగతి భవన్ లింక్ బయటపడిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఫిర్యాదుతోనే ఈ పేపర్ లీక్‌పై ఈడీ కేసు నమోదు చేసిందన్నారు. ఈ వ్యవహారాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ వదిలేదని లేదని.. ఈ కేసును సీబీఐ లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కేసుకు సంబంధించి ముందు కేటీఆర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని.. అప్పుడే కేసు ముందుకు సాగుతుందన్నారు. టీఎస్‌పీఎస్సీని కూడా రద్దు చేయాలని, బోర్డు సభ్యుడు లింగారెడ్డి నిన్న సిట్ ముందుకు వెళ్లాడని, అతని బావమరిది ప్రగతి భవన్‌లో సీఎం ఓఎస్‌డీ రాజశేఖర్ రెడ్డి అని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌కు రాజశేఖర్ రెడ్డి అత్యంత సన్నిహితుడని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో రాజశేఖర్ రెడ్డి పాత్ర ఏంటన్నది కూడా తేలాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏప్రిల్ 25న గజ్వేల్‌లో నిరుద్యోగ నిరసన సభ నిర్వహిస్తామన్నారు.
ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హతపై టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు రేవంత్ చెప్పారు. రేపటి నుంచి పోస్ట్ కార్డ్‌ల ఉద్యమం చేపడతామని.. ఏప్రిల్ 8న మంచిర్యాలలో సత్యాగ్రహ నిరసన దీక్ష, 10 నుంచి 25 వరకు హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 20వ తేదీ నుంచి 25 వరకు తాను పాదయాత్ర నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు. గౌతం అదానీ స్కాంపై పార్లమెంట్‌లో ప్రశ్నించినందుకే రాహుల్‌పై మోడీ, అదానీ, అమిత్ షాలు కక్ష సాధిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ALso REad: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌పై ఈడీ కేసు: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేవని కేసీఆర్ చెబుతున్న పేపర్ క్లిపింగ్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన రేవంత్ రెడ్డి.. పచ్చి అబద్దాన్ని కూడా నిజం అనిపించేలా చెప్పడంలో కేసీఆర్‌ను మించినోడు లేడని విమర్శించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవన్న కేసీఆర్ వ్యాఖ్యల్లో నిజమెంతో నిగ్గు తేల్చుదామన్న రేవంత్.. చర్చకు సిద్దమా? అంటూ సవాలు విసిరారు.
‘‘ఒకటైతే నిజం… పచ్చి అబద్ధాన్ని కూడా ఇదే నిజం అనిపించేలా చెప్పడంలో నిన్ను మించినోడు లేడు కేసీఆర్!. తెలంగాణలో రైతులు ఉరికొయ్యలకు వేలాడుతున్న లెక్కలు ఎన్‌సీఆర్‌బీ రికార్డుల్లో భద్రంగా ఉన్నాయి. లెక్కకు రానివి ఇంతకు పదింతలు. రైతు స్వరాజ్య వేదిక సమక్షంలో ఇద్దరం కూర్చుందాం… ఆత్మహత్యలు లేవన్న నీ మాటల్లో నిజమెంతో నిగ్గుతేల్చుదాం. కేసీఆర్…సిద్ధమా?!’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.