
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆదివారం మాజీ మంత్రి చంద్రశేఖర్ ఇంటికి రేవంత్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయ పునరేకీకరణలో భాగంగా కేసీఆర్ వ్యతిరేక శక్తులు ఏకంగా కావాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్‌ది ఫెవికాల్ బంధమని, వారిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటారని రేవంత్ ఆరోపించారు.
తెలంగాణలో కేసీఆర్, ఢిల్లీలో మోడీ వుండాలన్నదే వాళ్ల లక్ష్యమని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. దళితులకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కొంటోందని ఆయన ఆరోపించారు. కోకాపేట లాంటి ప్రాంతంలో ఇలాంటి భూములను ఎకరం 100 కోట్ల చొప్పున అమ్ముకుంటున్నారని రేవంత్ దుయ్యబట్టారు. అసైన్డ్ భూములను లాక్కొని గిరిజనులు, దళితులను కేసీఆర్ ప్రభుత్వం ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తోందని పీసీసీ చీఫ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అసైన్డ్ భూములకు భూ యాజమాన్యపు హక్కులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ రెండు పార్టీలు ఒక్కటేనని తెలుసుకున్నాక చంద్రశేఖర్ అక్కడ వుండలేకపోయారని ఆయన పేర్కొన్నారు.