హైద్రాబాద్ గాందీ భవన్ లో ఆదీవాసీ, గిరిజన మహాసభ జరిగింది.ఈ సభలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే పాల్గొన్నారు.
హైదరాబాద్:దేశంలో ఆర్ఎస్ఎస్ రాజనీతి కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే విమర్శించారు.ఆదివారంనాడు హైద్రాబాద్ గాంధీ భవన్ లో జరిగిన ఆదివాసీ, గిరిజన మహాసభలో మాణిక్ రావు ఠాక్రే పాల్గొన్నారు. ఎస్టీలకు కాంగ్రెస్ చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఆదీవాసీలతో మాట్లాడారన్నారు. ఆదీవాసీల సమస్యలపై రాహుల్ అధ్యయనం చేశారని ఆయన గుర్తు చేశారు. బడుగుల రిజర్వేషన్ల రద్దుకు ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నిందని మాణిక్ రావు ఠాక్రే ఆరోపణలు చేశారు.
హిందూ- ముస్లిం, ఆదీవాసీ- గిరిజనుల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయని ఆయన చెప్పారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను తప్పించడం ఇందుకు ప్రధాన కారణంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని 79 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్టీలే అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయిస్తారని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ చెప్పారు.ఎస్టీలంతా ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నారన్నారు.
తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే పార్టీ నేతల మధ్య సమన్వయం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం కేరళకు చెందిన ఎంపీ మురళీధరన్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కమిటీని కూడ ఇటీవలనే ప్రకటించింది. అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది.