తెలంగాణ లో భూములను వనరుగా పెట్టుకుని కేసీఆర్ వందల కోట్లు సంపాదిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్:తెలంగాణ సీఎం కేసీఆర్ భూదందాతో వందల కోట్లు సంపాదించాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. హెటిరో ఎండీ పార్ధసారథి రెడ్డి వినతి మేరకు క్యాన్సర్ ఆసుపత్రికి 15 ఎకరాల భూమిని అతి తక్కువకు లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు., కేసీఆర్ మోడల్ దేశానికి ప్రమాదంగా రేవంత్ రెడ్డి చెప్పారు.
సోమవారంనాడు హైద్రాబాద్ గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో జేడీ(ఎస్) నేత కుమారస్వామి కోసం కేసీఆర్ వందల కోట్లు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏపీలో ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ వందల కోట్లు ఖర్చు పెట్టారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను అస్థిరపర్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
లక్ష కోట్లతో దేశ రాజకీయాలను ఆక్రమించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ మోడల్ దేశానికి ప్రమాదకరమని ఆయన ఆరోపించారు. జేడీఎస్ ద్వారా కేసీఆర్ తన అస్థిత్వాన్ని కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. భూములను వనరుగా పెట్టుకొని కేసీఆర్ వందల కోట్లు సంపాదిస్తున్నారని ఆయన చెప్పారు. విపక్షాలకు ఇచ్చేందుకు కేసీఆర్ కు అంత డబ్బు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ భూదోపీడీకి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తనతో ఉన్నవాళ్లకు కేసీఆర్ భూములు పంచుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు.
2016 జూన్ 15న హెటిరో పార్థసారథిరెడ్డి క్యాన్సర్ ఆసుపత్రికి 10 ఎకరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకుందని రేవంత్ రెడ్డి చెప్పారు. సాయి సింధు సంస్థ కు ఈ భూమిని కేటాయించాలని ఆ లేఖలో కోరారని రేవంత్ రెడ్డి చెప్పారు.
వెంటనే హెటిరో పార్ధసారథి రెడ్డి ధరఖాస్తుకు కేసీఆర్ సర్కార్ వెంటనే అంగీకరించిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సీఎంఓ ఆదేశాలతో అప్పటి రెవిన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్రఅప్పటి రంగారెడ్డి కలెక్టర్ కు లేఖ రాసినట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు.
సాయి సింధు అనే సంస్థకు హైద్రాబాద్ హైటెక్ సిటీ వద్ద సర్వే నెంబర్ 41/14/2 'సర్వే నెంబర్ లో 15 ఎకరాల భూమిని లీజుకు ఇస్తే క్యాన్సర్ ఆసుపత్రిని కడుతారని లేఖలో ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ భూమిని పరిశీలించాలని నివేదిక పంపాలని ప్రదీప్ చంద్ర ఆ లేఖలో కోరినట్టుగా రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఆ లేఖను చూపించారు. రూ. 5346 కోట్ల కు ఇవ్వాల్సిన లీజుకు కేవలం కోటికి మాత్రమే ఇచ్చారని రేవంత్ రెడ్డి చెప్పారు.
కరోనా సమయంలో హెటిరో సంస్థ రెమిడిసివర్ ను మూడు వేలకు విక్రయించిందని ఆయన ఆరోపించారు. అత్యంత విలువైన భూమిని ప్రభుత్వం ఎలా హెటిరో పార్థసారథిరెడ్డికి అప్పగిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల ఈ సంస్థకు భూమి ఇవ్వవచ్చు కదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
రాజకీయాల్లోకి నేర ప్రవృత్తి ఉన్న వాళ్లు రావడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వంద మంది దావూద్ ఇబ్రహీంలతో కేసీఆర్ సమానమని ఆయన ఆరోపించారు. దేశంలోని అన్ని దర్యాప్తు సంస్థలకు ఈ విషయమై ఫిర్యాదు చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. హైద్రాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి , మెదక్ కలెక్టర్లతో పాటు సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్ , వెంకటనరసింహరెడ్డిలు జైలు ఊచలు లెక్కించాల్సిందేనని రేవంత్ రెడ్డి చెప్పారు.
దేశంలోని అన్ని పార్టీలకు కేసీఆర్ భూ దందాకు సంబంధించి లేఖలు రాయనున్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు. మరో వైపు కేసీఆర్ ను ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ ను అనుమతి కోరనున్నట్టుగా రేవంత్ రెడ్డి తెలిపారు.