
ధరణి పోర్టల్ వెనుక గుడుపుఠానీ వుందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్ మొత్తం కేటీఆర్ సన్నిహితుడు శ్రీధర్ చేతుల్లో వుందన్నారు. ధరణి పోర్టల్‌తో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. లక్షలాది ఎకరాల భూములను కాజేసి వాటిని లేఔట్లుగా వేసి అమ్మేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ , ప్రైవేట్ భూములు, ఆధార్ , పాన్ , బ్యాంక్ ఖాతాల వివరాలు విదేశీ వ్యక్తుల చేతుల్లో వున్నాయని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ధరణి పోర్టల్‌కు సంబంధించి సీనియర్ నేత కోదండ రెడ్డి ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి వివరాలు సేకరించిందని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లో 1500 ఎకరాల భూమిని కాజేశారని. కర్ణాటకలో తన్ని తరిమేసిన అమూల్ డైరీకి వందల ఎకరాలు కట్టబెట్టారని రేవంత్ మండిపడ్డారు. మంత్రి గంగుల కమలాకర్ కంపెనీకి కూడా భూములు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో దేవాదాయ శాఖ భూములను ఫార్మా కంపెనీకి అప్పగిస్తే హైకోర్ట్ స్టే విధించిందని ఆయన గుర్తుచేశారు.