
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో రాష్ట్ర బీజేపీలో సంచలన మార్పులు జరిగాయి. తెలంగాణ బీజేపీని రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థి నిలపడంలో మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ సఫలమయ్యారు. ఈ ఎన్నికల్లోనూ ఆయన సారథ్యంలోనే బీజేపీ బరిలోకి దిగుతుందని అందరూ అనుకున్నారు. కానీ, పార్టీలో అంతర్గత విభేదాలు రాజుకోవడం, బండి సంజయ్ పై కొందరిలో అసంతృప్తి పెరగడం, ఇతర బీజేపీ వ్యూహాలతో ఆయనను పదవి నుంచి తప్పించారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీకి పిలిపించుకుని మరీ చెప్పారు. కేంద్ర మంత్రి పోస్టు ఆఫర్ ఇచ్చినా బండి సంజయ్ స్వీకరించడం లేదని తెలుస్తున్నది.
పార్టీకి సముచిత స్థానాన్ని తీసుకువచ్చిన తనను అధ్యక్ష పదవి నుంచి తప్పించడంపై బండి సంజయ్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. కేంద్రమంత్రి పదవిని స్వీకరించడానికి ఆయన విముఖతను ప్రదర్శించినట్టు తెలిసింది. తన అభిప్రాయాలను జేపీ నడ్డా సహా ఇతరులకూ తెలియజేసినట్టు కొన్ని కీలక వర్గాలు వెల్లడించాయి. అయితే, ఎలాగైనా బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి అప్పజెప్పాలనే ఉద్దేశంతో, ఆయనకు నచ్చజెప్పడానికి సునీల్ బన్సల్‌తో భేటీ అయ్యారు.
ఇదే సందర్భంలో బండి సంజయ్ తన అసంతృప్తి తెలుపుతూ తనపై కొందరు పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. తనపై, పార్టీ హైకమాండ్ పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ పెద్దల ముందు ప్రస్తావించినట్టు సమాచారం.
Also Read: బీఆర్ఎస్‌కు మూడోసారి తెలంగాణ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా? ప్రభుత్వ వ్యతిరేకతపై కాంగ్రెస్ ఫోకస్
ఈ నేపథ్యం లోనే పార్టీ గీత దాటి బాహాటంగా తోటి నేత పై, హైకమాండ్ పైనా నోరుపారేసు కున్నాడనే కోణంలో రఘునందన్ రావు పై యాక్షన్ తీసుకోవడానికి అధిష్టానం ఆలోచనలు చేస్తున్నట్టు ఆ వర్గాలు వివరించాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశం కాబోతున్నందున ఢిల్లీలోనే ఆగి గురువారం బండి సంజయ్ తెలంగాణకు రాబోతున్నట్టు చెప్పాయి.