వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు: రేవంత్ రెడ్డి సంచలనం

By narsimha lode  |  First Published Oct 4, 2023, 1:53 PM IST

బీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య సంబంధం బయటకు వచ్చిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.


హైదరాబాద్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు ఉంటుందని  బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఒకరు తనతో చెప్పారని  టీపీసీసీ రేవంత్ రెడ్డి  తెలిపారు.  9 స్థానాల్లో బీఆర్ఎస్,  ఏడు స్థానాల్లో  బీజేపీ పోటీ చేయనుందన్నారు. ఒక్క స్థానాన్ని ఎంఐఎంకు వదిలిపెడతారని రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు పనిచేస్తాయన్నారు.  

బుధవారంనాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  గాంధీ భవన్ లో  మీడియాతో మాట్లాడారు.  మోడీ, కేసీఆర్ ఒక్కటైనప్పుడు  బీఆర్ఎస్‌తో ఎంఐఎం ఎలా కలిసి ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సెక్యులర్ వాదులమని చెప్పే అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు ఏం చెబుతారన్నారు.ఈ విషయమై తమ పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని ఓవైసీని రేవంత్ రెడ్డి కోరారు.

Latest Videos

undefined

బీజేపీ అధ్యక్షుడిని మార్చాలని కేసీఆర్ మోడీని కోరారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ కు కేసీఆర్ డబ్బులు పంపారని మోడీ ఆరోపించిన విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ ఆ సమాచారం ఉంటే కేసీఆర్ పై మోడీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పై ఈడీ, ఐటీ సంస్థలు ఎందుకు కేసులు నమోదు చేయలేదో చెప్పాలని రేవంత్ రెడ్డి కోరారు.  కేసీఆర్ తన అక్రమ సంపాదనలో  కొంత మోడీకి చెల్లిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

బీఆర్ఎస్ అవినీతిలో బీజేపీని కేసీఆర్ భాగస్వామ్యం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ రహాస్య స్నేహాన్ని మోడీ నిజామాబాద్ లో బయటపెట్టారని రేవంత్ రెడ్డి  చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ అవిభక్త కవలలని ఆయన చెప్పారు. ఈ రెండు పార్టీలది ఫెవికాల్ బంధంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

నీళ్లు, నిధులు , నియామాకాల పేరుతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. నీళ్లంటే కవిత కన్నీళ్లు గుర్తుకు వస్తాయని ఆయన సెటైర్లు వేశారు.నిధులంటే కాళేశ్వరం అవినీతి గుర్తుకు వస్తుందన్నారు.నియామకాలంటే కేటీఆర్ కు సీఎం సీటు గుర్తుకు వస్తుందని  రేవంత్ రెడ్డి చెప్పారు.

ధరణి దోపీడీ, ఔటర్ రింగ్ రోడ్డు  టెండర్లు, హైద్రాబాద్ భూముల అమ్మకంపై తాను ఈడీ, ఐటీ శాఖలకు ఫిర్యాదులిచ్చినా కూడ  ఎలాంటి చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి  ప్రశ్నించారు.ఈ రెండు పార్టీల మధ్య అనైతిక బంధం కారణంగానే  ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు.కేసీఆర్ కు బాస్ మోడీ అని తేటతెల్లమైందని రేవంత్ రెడ్డి చెప్పారు. కేటీఆర్ ను సీఎం చేయడానికి మోడీ ఆశీర్వాదాన్ని కేసీఆర్ కోరిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.  
 

click me!